Search This Blog

Sunday 17 June 2018

TIRUMALA SRI VENKATESWARA SWAMY TEMPLE - వేంకటేశ్వరునికి ఆలయం కట్టించిన తొండమానుడు



 *వేంకటేశ్వరునికి ఆలయం కట్టించిన తొండమానుడు*



ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం సామ్రాజ్యానికి అధిపతి తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు.

''భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మనమధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకో దలచాను. కలియుగం అంతమయ్యేవరకు వేంకటేశ్వరుని అవతారంలో, కొండమీదే ఉంటాను. కనుక నువ్వు నాకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి పుష్కరిణి పక్కన ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు..'' అన్నాడు.

వేంకటేశ్వరుని మాటలు విన్న తొండమానుడు - ''సంతోషం స్వామీ, గొప్ప మాట సెలవిచ్చారు.. తమరు కోరిన విధంగా తక్షణం ఆలయం నిర్మిస్తాను...'' అని బదులిచ్చాడు.

అంతటితో తొండమానుడికి మెలకువ వచ్చేసింది. ఇక ఆతనికి ఆకాశంలో తెలిపోతున్నట్టుగా ఉంది. స్వామివారు తనకు స్వప్నదర్శనం ఇవ్వడం అంటే సామాన్యమైన సంగతి కాదు. పైగా తనకో గుడి కట్టించమంటూ బృహత్తర బాధ్యత అప్పజెప్పాడు. అది కేవలం కలగా అనిపించలేదు. వేంకటేశ్వరుడు ప్రత్యక్షమైనట్టే ఉంది. స్వయంగా చెప్పిన భావనే కలిగింది. సంతోషంతో మురిసిపోయాడు. శ్రీనివాసుని కోసం ఆలయం నిర్మించేందుకు ఆప్తులతో చర్చించాడు, ప్రణాళిక రచించాడు.

తొండమానుడు వెంటనే విశ్వకర్మను రప్పించాడు. మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించాడు. కేవలం దేవాలయం, గర్భగుడి, ధ్వజస్తంభంతో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా కట్టించాలి అనుకున్నాడు. తొండమానుడు అనుకున్నట్టుగానే, అనతికాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది. విశాలమైనపాకశాల, సువిశాలమైన గోశాల, గజశాల, అశ్వశాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం - ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది.

ఆలయం అపురూపంగా ఉంటే సరిపోతుందా? గుడిని చేరడానికి మార్గం సుగమంగా ఉండాలి కదా. అందుకోసం కొందరు భక్తులు శేషాచలం చేరడానికి రెండువైపులా దారులు ఏర్పరిచారు. సోపానాలు నిర్మించారు. మార్గమధ్యంలో అక్కడక్కడా మంటపాదులు నిర్మించారు.

ఆలయ నిర్మాణం, గుడికి వెళ్ళే రహదారి, సోపానాలు పూర్తయిన తర్వాత విషయాన్ని వేంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వేంకటేశ్వరుడు ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకములకు తెలియపరిచాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలిసి శేషాచలం చేరుకున్నారు. శుభ ముహూర్తం చూసి వేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై ఆలయమున ఆనంద నిలయంలో ప్రవేశించాడు. అది అద్భుతమైన, అపురూపమైన వేడుక. అత్యంత కమనీయంగా, రమణీయంగా జరిగింది. ఆ వేడుకను చూట్టానికి రెండు కళ్ళూ చాల్లేదు.

వేంకటేశ్వరుడు ఆలయంలో ప్రవేశించే సమయంలో దేవతలు పూవులు జల్లారు. అతిధులకు పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం ఏర్పాటు చేశారు. దక్షిణ, తాంబూలాలు ఇచ్చారు. వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. ఆవిధంగా దేవతలందరినీ సగౌరవంగా సత్కరించి పంపారు.

తిరుమల వేంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో ఈవిధంగా ఉన్నాయి. మొత్తానికి తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవరాజులు, తంజావూరు చోళులు, విజయనగర రాజులు దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు.


No comments:

Post a Comment