పోతన మొట్టమొదట పద్యం
పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.
శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!
పోతనగారి శక్తి ఏమిటోపోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి – ఆ పద్యం ఒక్కటి చాలు – మీ జీవితమును మార్చేస్తుంది. ’ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరం లేకుండ ఈశ్వరునిలో కలిసిపోవడం. అలా ’ఈశ్వరుడియందు నా తేజస్సువెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను” అన్నారు.
రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు. కాబట్టి చెయ్యి పోతనగారిది. ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.
పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు. లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ’ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అదేపనిగా ఆయనపెట్టిన అన్నం తిని, ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపంలో ఉంటాడు. కాని తనను నమ్ముకొనిన వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. ఈశ్వరుడు అలా పరుగెట్టే లక్షణం ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడం వలననే వారికి అజ్ఞానం వచ్చేసింది. ’ఈలోకములనన్నిటిని లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను.’ ఇందులో ఎవరిపేరునూ పోతనగారు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. ’సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయైన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. కేవలం తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడు ఎవరు వున్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను.’ భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. కాని ఇక్కడ కృష్ణుడని అనడం లేదు. ’మహానందాంగన’ అని ప్రయోగించారు. వానిని గురించి నేను చెపుతున్నాను. వాడు చిన్న పిల్లవానిలా కనపడుతున్నాడు. కాని వాడు పరబ్రహ్మ అందుకని వానికథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఇంతేకాదు. అందులో ఒక రహస్యం పెట్టేశారు. పోతనగారిలా బతకడం చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకొని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు ఎంతవిచిత్రమయిన మాట వాడతారో చూడండి –
’కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత
భవాండకుంభకు మహానందాంగనా డింభకున్’
అన్నారు. ఎవరు ఈ మహానందాగన? మీరు ఇంకొకరకంగా ఆలోచించారనుకోండి – మనం పొందే ఆనందమును శాస్త్రం లెక్కలుకట్టింది. ఆనందమును శాస్త్రం నిర్వచనం చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని ’మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో ఎవరికి వాడారు? శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో అమ్మవారికి వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు.
No comments:
Post a Comment