Search This Blog

Monday 26 February 2018

Vedas - Classification


యుగములు-వేదములు-ఉపనిషత్తులు- పురాణములు:

కాలము, యుగము రూపములో తిరుగుచున్నది. కావున పరమేశ్వరుడు, ప్రతియుగములోనూ సకలజీవములకు, రక్షణ కల్పించుటకు మానవ మనుగడ, సనాతన ధర్మమార్గములో నడిపించడానికి, మానవ జీవోద్దరణకు, మనకొరకు పరమాత్మ, వేదములను ప్రసాదించాడు.
                                                 




నాలుగు యుగములలో అనగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము ఈ మూడు యుగములలో,భగవంతుడు కరచరణాదులతో మానవులతో, కలసి మెలసి జీవించి, మానవ జాతిని ఉద్ధరించాడు. కానీ కలియుగములో,పరమాత్మ కరచరణాదులతో కనిపించడు. కాబట్టి పరమాత్మ మనకు, వేదములను ప్రసాదించాడు. వేదములే మనకు ప్రమాణము. అంతకు మించిన ప్రమాణము లేదు.

                                                     

ఈ వేదములు నాలుగు కానీ మహాభారతము పంచమ వేదముగా పిలువబడి, వేదములు ఐదుగా విరాజిల్లుచున్నవి. వేదముల నుండి, వేదాంగములు అందుండి ఉపనిషత్తులు, వేదాంతమునకు, భక్తికి, వేదములు ప్రారంభస్థానమైతే, వేదాంతమునకు వేదసారములకు ఉపనిషత్తులు చివరి భాగము.

ఉపనిషత్తులు 108. ఈ ఉపనిషత్తులు ఐదు వేదముల నుండి వచ్చాయి.
ఋగ్వేదము నుండి 10 ఉపనిషత్తులు
శుక్ల యజుర్వేదము నుండి 19 ఉపనిషత్తులు
కృష్ణ యజుర్వేదము నుండి 32 ఉపనిషత్తులు
సామవేదము నుండి 16 ఉపనిషత్తులు
అధర్వణ వేదము నుండి 31 ఉపనిషత్తులు
మొత్తం 108
ఈ 108 ఉపనిషత్తులలో ప్రధానమైనవి 12 ఉపనిషత్తులు.

1)ఈశోపనిషత్తు 2) కేనోపనిషత్తు 3) కఠోపనిషత్తు 4) తైతిరీయోపనిషత్తు 5) ఐతరేయోపనిషత్తు 6) ప్రశ్నోపనిషత్తు 7) ముండకోపనిషత్తు 8) మాండుక్యోపనిషత్తు 9) ఛాందోగ్యోపనిషత్తు 10) శ్వేతశ్వతరోపనిషత్తు 11)బృహదారణ్యకోపనిషత్తు 12) మహానారాయణకోపనిషత్తు
ఎనిమిది ఉపప్రధానమైన ఉపనిషత్తులు .
1) కైవల్యకోపనిషత్తు 2) కౌషితకోపనిషత్తు 3) ఆత్మోపనిషత్తు 4) అమృతబిందోపనిషత్తు 5) బ్రహ్మోపనిషత్తు 6) పరమహంసొపనిషత్తు 7) సర్వోపనిషత్తు 8) అరుణేయోపనిషత్తు
ఈ ఉపనిషత్తుల నుండి అష్టాదశ పురాణములు వచ్చాయి. అవీ మన సౌకర్యము కొరకే.
అష్టాదశపురాణములు మూడు భాగములుగా ఉండి ఒక్కో భాగములలో ఆరు పురాణములు.
బ్రహ్మపురాణములు, బ్రహ్మతత్వమును గురించి
విష్ణుపురాణములు, విష్ణుతత్వము గురించి
శివపురాణములు, శివతత్వమును గురించి వివరిస్తూ ఉన్నాయి.
విష్ణుసంబంధపురాణములు-6
1.భాగవత పురాణము:- 18 వేల శ్లోకముల సముదాయము.
2.విష్ణుపురాణము:- 23 వేల శ్లోకములతో విష్ణు భక్తుల గురించి, వర్ణాశ్రమధర్మములను,వేదముల యొక్క ఆరు అంగములను, కలిపురుషుని లక్షణాలను, శ్వేతా వరాహ కల్పముల విషయములను తెలియచేయుచున్నది.
3.నారదీయపురాణము:- 25 వేల శ్లోకములతో వేదాంత ముఖ్యమైన విషయములను, వేదాంత సారములను, పూరీజగన్నాథుడు,ద్వారకానాథుడు, బదరీనాథుల గురించి తెలియచేయుచున్నది.
4.పద్మపురాణము:- 55 వేల శ్లోకములతో భాగవత, రామాయణ, జగన్నాథ, మత్య్సావతార, భృగు మొదలగు విషయముల గురించి తెలియజేయుచున్నది.
5. గరుడపురాణము:- 19 వేల శ్లోకములతో భగవద్గీత, జనన మరణ, విష్ణు సహస్రనామముల గురించి తెలియజేయుచున్నది.
6.వరాహపురాణము:- 24 వేల శ్లోకములతో కూడిన వ్రతరాజముల గురించి విష్ణు మహిమల గురించి తెలియజేయు చున్నది.


II.బ్రహ్మసంబంధపురాణములు-6
1.బ్రహ్మానందపురాణము:- 12 వేల శ్లోకములతో వేదముల గురించి ఆదికల్పమును గురించి తెలియజేయుచున్నది.
2.బ్రహ్మవైవర్తపురాణము:- 18 వేల శ్లోకములతో రాధా కృష్ణుల గురించి తెలియజేయుచున్నది.
3.మార్కండేయ పురాణము:- 9 వేల శ్లోకములతో రామ కృష్ణుల లీలలను గురించి తెలియజేయుచున్నది.
4.భవిష్యపురాణము:- 14500 శ్లోకములతో కృష్ణ భగవానుని మరియు చైతన్య ప్రభువును గురించి తెలియజేయు చున్నది.
5.వామనపురాణము:- 10 వేల శ్లోకములతో త్రివిక్రమ స్వామిని గురించి తెలియజేయుచున్నది.
6.బ్రహ్మపురాణము:- 10 వేల శ్లోకములతో దక్ష ప్రజాపతికి, బ్రహ్మదేవుడు వివరించిన, విషయములను గురించి తెలియజేయుచున్నది.


III.శివసంబంధపురాణములు:-6
1.మత్స్యపురాణము:- 14 వేల శ్లోకములతో దేవాలయ నిర్మాణములు, అందు పాటించవలసిన నియమములు, వామనావతారము వరాహ కల్పమును గురించి తెలియజేయుచున్నది.
2.కూర్మపురాణము:- 17 వేల శ్లోకములతో లక్ష్మీ కల్పము, ధన్వంతరి, కృష్ణ సూర్య, సంవాదముల గురించి తెలియజేయుచున్నది.
3.లింగ పురాణము:- 10 వేల శ్లోకములతో గాయత్రి మాత నృసింహ,జగన్నాథ్, అంబరీషుల గురించి తెలియజేయు చున్నది.
4.శివపురాణము:- 24 వేల శ్లోకములతో ఆరు సంహితలతో రోమర్పుల గురించి తెలియజేయుచున్నది.
5.స్కందపురాణము:- 81 వేల శ్లోకములతో తారకాసురవధ, సుబ్రహ్మణ్యస్వామి గురించి తెలియజేయుచున్నది.
6.అగ్నిపురాణము:- 15400 శ్లోకములతో సాలగ్రామములను గురించి వివరముగ తెలియజేయుచున్నది. మానవ జీవితమును ధర్మమార్గములో నడిపించేవి, నడిపించేందుకు ఆదర్శప్రాయ మైన, ప్రమాణికమైన, గ్రధరాజములుఇతిహాసములు. ఇతి-హా-అసం
1.శ్రీ రామాయణము 2.మహాభారతము

మన ముఖ్య ఇతర గ్రంథములు:-
1) మనుస్మృతి 2) అర్థశాస్త్రము 3) ఆగమశాస్త్రము 4) తంత్రశాస్త్రము
5) స్తోత్రములు 6) ధర్మశాస్త్రము 7) దివ్యప్రబంధము
8) తివరము 9) రామచరిత మానస 10) యోగ వాశిష్టము
భక్తి నవవిధములు:-

శ్రీ నారద మహర్షులవారు సెలవిచ్చినవి నవవిధ భక్తి మార్గములు.
1.శ్రవణం 2. కీర్తనం 3. స్మరణం 4. పాద సేవనం 5. అర్చనం 6.వందనం 7 దాస్యం 8. సఖ్యం 9. ఆత్మ నివేదనం
ఇందులో ఒక్కొక్క భక్తి వలన కొంతమంది భక్తులు తరించారు, ముక్తిని పొందారు. ఏ ఏ భక్తి వలన ఎవరు ఎలా తరించి ముక్తిని పొందేరో .........చూడండి
1 శ్రవణం .......... :- వలన పరీక్షిత్ మహారాజు
2 కీర్తనం ......... :- వలన శ్రీ శుకుడు, శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీ మదాసు, శ్రీ అన్నమయ్య, శ్రీ తులసీ దాస్
3 స్మరణం ........ :- వలన ప్రహ్లాదుడు
4 పాదసేవనం ....:- వలన లక్ష్మీదేవి
5 అర్చనం ........ :- వలన పృధు మహారాజు
6 వందనం ........ :- వలన అక్రూరుడు, గరుత్మంతుడు
7 దాస్యం ......... :- వలన హనుమంతుడు
8 సఖ్యం .......... :- వలన అర్జునుడు, ఉద్దవుడు,గోపాల బాలురు
9 ఆత్మనివేదనం :- వలన బలి చక్రవర్తి
శ్రీ నారదులవారు చెప్పిన నవవిధ భక్తిమార్గములే కాక
1 మూఢ భక్తి ... :- వలన తిన్నడు
2 కామభక్తి ..... :- వలన గోపికలు
3 భయ భక్తి .... :- వలన కంసుడు
4 వైర భక్తి ....... :- వలన శిశుపాలుడు
5 సంబంధ భక్తి.. :- వలన విష్ణు వంశమువారు, గోపాలురు
6 ద్వేష భక్తి ...... :- వలన హిరణ్యకశిపుడు, జరాసంధుడు
7 ప్రేమ భక్తి........ :- వలన పాండవులు
8 భక్తితో భక్తి..... ..:- వలన నారదుడు
9 వాలిన భక్తి .... :- వలన పోతనామాత్యులు
వీరందరూ భక్తి మార్గములలో సేవించి తరించినవారే.
నమస్కారములు
నమస్కారములు చాలా విధములు అందులో

సాష్టాంగ నమస్కారము:-
ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు. ఈ ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.
“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా,
పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్, ప్రణామోస్థాంగముచ్యతే”
1కాళ్ళు 2 చేతులు 3 ముక్కు 4 చెవులు 5 ఉదరము 6 కళ్ళు 7 నోరు 8 మనస్సు
ముఖ్యగమనిక:- స్త్రీలు మాత్రము ఈ సాష్టాంగ నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారము మాత్రమే చేయాలి.

పంచాంగ నమస్కారము :-
పంచాంగములు 1 అరిచేతులు 2 మోకాళ్లు 3 మోచేతులు 4 పాదములు 5 శిరస్సు.

అభివాద నమస్కారము:-
ప్రవరతోటి చేయు నమస్కారము. అభివాద నమస్కారము నిలబడి చేయరాదు. పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి. గురువుగార్లలను, ఆచార్యదేవులను,
వేదపండితులను,నిత్యాగ్నిహోత్రులను, వయోవృద్దులను, జ్ఞానవృద్దులను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.
ప్రణిపాతము:- ఆర్తితో చేయు నమస్కారము. నేలమీదపడి నమస్కారము చేయడము.
“మహృదయ క్షేత్రాలలో భక్తి, అనే బీజాలను నాటండి. దీనిని మనస్సుఅనే నీటితో తడపండి. దానికి నాలుగు దిక్కుల సంత్సంగం అనే కంచె వేయండి. దానివలన కామాది, వికృతరూప, పశువులు రాకుండా ఉంటాయి. మీరీ విధంగా వ్యవహరిస్తే ఆ బీజాలు చిగురించి పంట పండి తర్వాతి కాలంలో శాంతి ఆనందం అనే పంట ఫలాలు మన చేతికి వస్తుంది.”


ఉపనిషత్తులు అంటే ఏమిటి?
వేదములు-అపౌరుషేయాలు. అంటే తపస్సు చేయుచున్న ఋషులకు, పరమాత్మ ద్వారా కేవలం, ఉదాత్త, అనుదాత్త స్వరములతో మాత్రమే వినిపించేవి. వీటికి లిపి లేదు. ఆ వేదములు ఋషుల ద్వారా మానవాళికి, ఆధ్యాత్మిక ధర్మ సంప్రదాయము లకు ముఖ్య సూత్రములు. సనాత ధర్మమునకు జీవనాడులు. ఈ వేద వేదాంగముల సారమే ఉపనిషత్తులు.

ఉప-ని-షత్ అంటే గురువు వద్ద కూర్చొని నేర్చుకోనేది. వీటినే శృతులు అని అంటారు. ఈ ఉపనిషత్తులు 250 పైనే ఉన్నాయి. కానీ వాటిలో 108 మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 108 లో కూడా ప్రామాణికమైనవి, ప్రాచీనమైనవి 14 మాత్రమే. ఈ 14 ఉపనిషత్తులకు పరమేశ్వరుడు, భూలోకానికి దిగి వచ్చి మన కొరకు ఆచార్యుల రూపాలలో పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ రమణ మహర్షులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ సరస్వతీ స్వామి వారు ఇలా ఎందరో మహానుభా వులు వేదములకు, వేద-వేదాంగములకు, ఉపనిషత్తులకు భాష్యం చెప్పారు.

14 ఉపనిషత్తులు.
1. ఋగ్వేదము :– ఐతరేయ ఉపనిషత్తు, కౌషీతకోపనిషత్తు
2. కృష్ణయజుర్వేదము:- తైత్తరీయోపనిషత్తు, కఠఉపనిషత్తు, మైత్రాయనీయోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు
3. శుక్లయజుర్వేదము:- ఈశావాశ్యకోపనిషత్తు , బృహదారణ్యకోపనిషత్తు
4. సామవేదము:- ఛాదోగ్య ఉపనిషత్తు, కెనోపనిషత్తు
5. అధర్వణవేదము:- ప్రశ్నోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, కైవల్యోపనిషత్తు

ఈ ఉపనిషత్తులలో లేనివి ఈ ప్రపంచంలో లేదు. అన్నీ ప్రశ్నలకు, సమాధానాలకు ఈ వేదాలు ఉపనిషత్తు లు మరియు ఆచార్యులు భాష్యములే ఆధారము. మనిషి తల్లి గర్భ ప్రవేశము నుండి, మరు భూమికి చేరి మరలా జీవుని పరిస్థితిని, కాలగతిని, అన్నీ ఇందులో నిక్షేపింపబడినాయి.

మనకు(దేహానికి) అనారోగ్యము చేసినప్పుడు, డాక్టరుగారి దగ్గరకు వెళ్ళి డాక్టరుచే సూదులు వేయించుకొని డాక్టరుగారు ఇచ్చిన మందులు వాడుతాము కదా? మరి మన జీవికి (ఆత్మకు) వచ్చిన అనారోగ్యము(అంటే అరిషడ్వర్గములు బాధించే బాధలు జరా-మరణ బాధలు) మాటేమిటి? ఈ అనారోగ్యమునకు పూజ, జపము, ధ్యానములే మందులు. ఈ మందుల మోతాదును ఉపయోగించే విధానమును మనకు తెలియచేయు వైద్యుడే గురువు. ఈ విధముగా గురు ఆజ్ఞ మేరకు మనము ఆ మందులను వాడి, ఆ మందులు మన శరీరంలోని అణువు అణువు నిండి నిమిడీకృత మైతే, ఇక మనలో యున్న ఆత్మకు అనారోగ్యము లేదు.

మన శరీరంలో 72 వేల నాడుల ఉంటాయి. అందులో 14 నాడులు ముఖ్యమైనవి. 1) పింగళ, 2) ఇడ 3) సుఘమ్న 4) సరస్వతి 5) పూష 6) వరుణ 7) సప్తజిహ్వ 8)యశస్విని 9) అలంబస 10) కుహు 11) విశ్వోధార 12) పయస్విని 13) గాంధార 14) శుంభి. ప్రధాన నాడులు. ఇడ,పింగళ, సుఘమ్న. వీటి మూడింటికి త్రిమూర్తులు అధినాయకులు. సుఘమ్న నాడికి కుడిప్రక్క సూర్యనాడి, ఎడమ ప్రక్క చంద్ర నాడి ఉంటాయి. ఈ సూర్య చంద్ర నాడులు కలుపు ప్రదేశమే భ్రూమధ్యము.

ఆజ్ఞాచక్రము:-
సూర్య చంద్ర నాడులు అంతర్ముఖముగా ప్రయాణించి పాలభాగము మీద అర్థ చంద్రాకృతిలో ఉంటాయి. అపుడు రెండు కనుబొమల మధ్య ఉన్న భ్రూకుటికి ఆజ్ఞా చక్రమని పేరు. ఈ ఆజ్ఞాచక్రము నిలబడి తెరుచుకుంటే దివ్యజ్ఞానము ప్రభాసిస్తుంది. దివ్యదృష్టి కలుగుతుంది.

శ్లో || నాస్తిలోభసమో వ్యాధిః | నాస్తి క్రోధసమోరివుః
నాస్థిదారిద్ర్యవత్ దుఃఖం | నాస్తి జ్ఞానాత్ పరం సుఖమ్ ||
లోభాన్ని మించిన వ్యాధి లేదు, క్రోధాన్ని మించిన శత్రువులు లేరు, దారిద్యాన్ని మించిన దుఃఖం లేదు, జ్ఞానాన్ని,తృప్తిని మించిన సుఖం లేదు.

పంచీకరణము పంచభూతపంచీకరణము
1.ఆకాశము 2. వాయువు 3.అగ్ని 4. జలము 5. భూమి
1.ఆకాశము :- ప్రధానముగా తీసుకొని ½ భాగము ఆకాశము, 1/8భాగము వాయువు,1/8 భాగము అగ్ని, 1/8భాగము నీరు, 1/8 భాగము భూమి.
2.వాయువు :- ప్రధానముగా తీసుకొనినా ½ భాగము వాయువు, 1/8 భాగము ఆకాశము,1/8 భాగము అగ్ని, 1/8 భాగము నీరు,1/8 భాగము భూమి.
3.అగ్ని:- ప్రధానముగా తీసుకొన్న భాగము అగ్ని, 1/8 భాగము ఆకాశము, 1/8 భాగము వాయువు, 1/8 భాగము నీరు,1/8 భాగము భూమి.
4.జలమును:- ప్రధానముగా తీసుకొనిన 1/2 భాగము జలము, 1/8 భాగము ఆకాశము,1/8 భాగము వాయువు,1/8 భాగము అగ్ని, 1/8 భాగము భూమి.
5. భూమిని:- ప్రధానముగా తీసుకొనిన ½ భాగము భూమి, 1/8 భాగము ఆకాశము, 1/8 భాగము వాయువు, 1/8 భాగము అగ్ని, 1/8 భాగము జలము.
పై విధముగా పంచభూత పంచీకరము జరిపిన ఆభావములు తెలియవచ్చును.
కావున
1) ఆకాశమునకు శబ్దగుణము కలదు
2) వాయువుకు శబ్ద, స్పర్శ రెండు గుణములు
3) అగ్ని శబ్ద,స్పర్శ, రూప గుణములను కలిగి ఉంది.
4) జలమునకు శబ్ద, స్పర్శ, రూప, రస రూపములుంటాయి.
5) భూమికి శబ్ద,స్పర్శ, రూప, రస, గంథములనబడే ఐదు గుణములుంటాయి. కావున పంచభూతములు ఈ సృష్టిలో,సృష్టిచే శక్తిని పొంది ఉన్నాయి. కావున ఈ సృష్టి అంతా పంచ భూతాత్మకము.ఈ పంచ భూతములను ఆధారముగా తీసుకొని ఇరవై అయిదు తత్వములు ఏర్పడ్డాయి వీనినే పంచ వింశతి తత్వము అంటారు. ఎలాగంటే పంచభూత పంచీకరణము ఆధారంగానే పంచ వింశతి తత్వములు వస్తాయి. పరబ్రహ్మము నుండి ఏర్పడిన ఈ పంచభూత పంచ వింశతిని జాగ్రత్తగా గమనిస్తే మనిషి మనుగడ మానవుని నడవడి అర్థమవుతుంది.

1. ఆకాశము ప్రదానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము ఆకాశధార పరబ్రహ్మము.
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా మనసు
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా బుద్ది
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా చిత్తము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా అహంకారము

2. వాయువు ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము ధారంగా ఉదాన వాయువు
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా సమానము
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా వ్యానము
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా అపానము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా ప్రాణము

3. అగ్ని ప్రధానమైన రెండు భాగములు చేసిన అందు ½ భాగము అగ్ని చక్షువు
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా శ్రోత్రము
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా త్వక్కు
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా జిహ్వ
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా ఘ్రాణము

4. జలము ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము జలరసము
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా శబ్దము
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా స్పర్శ
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా రూపము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా గంథము.

5. భూమి ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము భూమి గుదము.
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా వాక్కు
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా పాణి
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా పాదము
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా గుహ్యము
ఇలా స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ శరీరములగుచున్నవి. స్థూల సూక్ష కారణ శరీరముల పైన పరమాత్మ ఉండును.

Saturday 24 February 2018

AHOBILAM & NAVANAARASIMHAS DETAILS - అహోబిల క్షేత్రమందు నవనారసింహులు




అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు. అహోబిల క్షేత్రం లో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. నిసర్గ రమణీయమైన నల్లమల అడవులకే సింగారమై నిలిచినారు.

🌹 *జ్వాలా నరసింహ క్షేత్రము* 🌹

వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీ మన్నారాయణుడు తొణకలేదు, కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు.

🌹 *అహోబిల నరసింహ స్వామి* 🌹

ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు. ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం. ఈ అహోబిలానికి దేవతలు స్తుచించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు.

🌹 *మాలోల నరసింహ స్వామి* 🌹

వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మిలోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక.

🌹 *వరాహ నరసింహస్వామి (క్రోడా)* 🌹

వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి.

🌹 *కారంజ నరసింహస్వామి* 🌹

కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు.

🌹 *భార్గవ నరసింహస్వామి* 🌹

పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది.

🌹 *యోగానంద నరసింహస్వామి* 🌹

యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.

🌹 *చత్రవట నారసింహస్వామి* 🌹

పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు.

🌹 *పావన నరసింహ స్వామి* 🌹

పరమపావన ప్రదేశం లో ఏడుపడగల

ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. మరియు "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు.

Monday 12 February 2018

THE STORY OF HOW HANAN CHALISA CAME - హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది






హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది

ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !

తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?

తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.

పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.

తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.

ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.

Sunday 11 February 2018

SIVAMAHAPURANAM - PARVATI KALYANAM - PART VIII - 40


పార్వతీ కళ్యాణము – పార్ట్ 8


కళ్యాణం కోసమని శివుడు పీటల మీదకు వచ్చి కూర్చుంటున్నాడు. అది గొప్ప చారిత్రాత్మకమయిన కళ్యాణము. కాబట్టి శివుడు పీటల మీదికి వస్తుంటే మేఘముల లోంచి వృష్టి పడిపోయిందా అన్నట్లుగా పువ్వులు జల్లేశారు. అయ్యవారు పెద్దపుష్ప వృష్టితో పెద్ద మేళతాళముల ధ్వనులతో గణాధిపులు అందరూ నిలబడి ఎక్కడ చూసినా జయజయశంకర హరహర శంకర అని జయజయ ధ్వానాలు చేస్తుంటే పీటల మీదికి వచ్చి కూర్చున్నాడు. పార్వతీదేవి గౌరీతపస్సు చేసింది. ఆవిడే ఆవిడ గురించి తపస్సు. ఎందఱో ధన్యులు అయినవారు, దిక్పాలకులు, ఇంతమంది మధ్యలో నిలబడి కొలుస్తుండగా చుట్టూ ఒకపక్కన సరస్వతీదేవి, మరొక పక్కన లక్ష్మీదేవి, అరుంధతి శచీదేవి వీళ్ళందరూ వెంట వస్తుంటే అమ్మవారు పెళ్ళి పీటల మీదికి బయలుదేరి వస్తోంది.
ఎన్నడూ అలా వెళ్ళవలసిన అవసరం లేని శంకరుడు పార్వతీదేవి అడిగిందని కన్యాదాత గారింటికి తానే వచ్చాడు. హిమవంతుడి ఇంటికి వచ్చి లోపల పొంగిపోతూ సంతోషంగా ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు పూర్ణ చంద్రుడు అవుతుంటే కళలు పెరుగుతుంటే సముద్రంలో పోతూ పెరుగుతుంది. పెళ్ళి పీటల మీదకి స్వామివస్తుంటే పౌర్ణమి చంద్రుని చూసిన సముద్రం పొంగిపోయినట్లు జనం అందరూ దేవసార్వభౌముడిని జగదంబతో పీటల మీద చూస్తున్నాము మా కలలు పండిపోయాయి. మాకు కన్ను ఉన్నందుకు ఇన్ని కోట్ల జన్మల తరువాత మా నేత్రములు సార్ధకత చెందాయిఅని పరవశించి పోతున్నారు
ఇపుడు హిమవంతుడు శంకరుడిని తీసుకువచ్చి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి మహానుభావుడు శంకరుడు నాకు అల్లుడు అవడానికి తనకు పిల్లనివ్వమని కబురు చేయడం మాని తానే వచ్చాడని పొంగిపోయి వినయ విధేయతలతో పెళ్ళికొడుకు కాళ్ళు కడిగాడు. పార్వతీ పరమేశ్వరులకు మధ్యలో తెర కట్టారు. తెరకు అటువైపు శంకరుడు, ఇటువైపు పార్వతీదేవి కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరులవి శరీరములు రెండు, కానీ మనస్సు మాత్రం ఒక్కటే. ఇద్దరి మనస్సులో ఒక్కటే కోరిక ఉంది. ఇది లోకంలో దంపతుల మధ్యనయినా ఉండేదే. అబ్బ మధ్యలో తెరను ఎప్పుడు తీసేస్తారా అని అనుకుంటున్నారు. అనగా ఇద్దరి మనస్సులలోను ఒకటే కోర్కె దంపతులకు అలా ఉండాలి.
ఇపుడు హిమవంతుడు కన్యాదానం చేయడం కోసమని చెప్పి మేనకాదేవి కలశంతో నీళ్ళు పట్టుకొనగా శంకరుని పాదములు కడగడం కోసమని సిద్ధపడ్డాడు. అక్కడ బ్రహ్మగారు యాజ్ఞీకం చేస్తున్నారు. ఆయన అన్నారుపిల్లవాడి ప్రవర చెప్పాలి కదా ఎవరికి తెలుసండిఅని అడిగారు. అపుడు అక్కడ ఉన్నవారిలో ఒక పెద్దాయననీవు చతుర్ముఖ బ్రహ్మవిబ్రహ్మ స్థానంలో ఉన్నవాడివి. అటువంటి వాడివి నీకే తెలియక పోతే ఎవరికీ తెలుస్తుంది? పోనీ లక్ష్మీ నారాయణులను అడగండి. అన్నారు. అపుడు నారాయణుడు నేను ఆయన వామభాగంలోంచి పుట్టాను నాకన్నా ముందు ఉన్నాడు ఆయన. నాకు ఆయన సంగతి తెలియదు అన్నాడు. మరి ఎవరిని అడిగితే తెలుస్తుందా అని పరికిస్తే అక్కడ పొంగిపోతూ వీణ వాయిస్తున్న నారదుడు కనిపించాడు. నారదుని అడుగగా మహాత్ముడికి ప్రవర ఏమిటి? నిర్గుణ నిష్కలంక నిరంజన అని ప్రవర చెప్పేయండి అంతే అని చెప్పేసరికి సభలో ఉన్నవారు పొంగిపోయి శంకరుడికి ప్రవర అలా చెప్పండని అన్నారు.
అప్పుడు అల ప్రవర చెప్పి హిమవంతుడు మేనకాదేవి పార్వతీ దేవిని కన్యాదానం చేస్తున్నారు. అప్పుడు తెరతీసి శుభముహూర్తంలో జీలకర్ర, బెల్లం పెట్టిస్తున్నారు. తెర పైకెత్తినపుడు కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి. తెర తీసివేయగానే ఆవిడ ఆయనను, ఆయన ఆవిడ చూసుకుంటారు. శుభ ముహూర్తంలో కళ్ళు కళ్ళు కలుసుకుంటే జీవితాంతం మనస్సులు ఏకీకృతం అవుతాయి. ఇద్దరి మధ్య అనురాగం అంకురిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వారు లోకమునకు పాఠం చెప్తున్నారు
ఇపుడు తలంబ్రాలు పోసుకోమన్నారు. కోరికలు పోస్తోందా అన్నట్లు అమ్మవారు తలంబ్రాలను పోస్తోంది. అన్నీ తీరుతాయి అన్నట్లుగా పున్నమి చంద్రుడి వంటి ముఖము ఉన్న పార్వతీదేవి తలమీద తలంబ్రాలను శంకరుడు పోశాడు. అలా ఇద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్న ఘట్టం చూసి లోకం అంతా పొంగిపోయింది. తరువాత పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణమునకు శక్తిమంతమయిన మంత్రం చెప్తారు. తరువాత విడిది గృహప్రవేశం చేయించాలి. అప్పుడు వారిని బయటకు తీసుకు వచ్చి పీఠంమీద విడిది గృహప్రవేశం చేయించారు. తదుపరి లాజహోమంతో కార్యక్రమం పూర్తిచేస్తారు. అప్పుడు దేవతలందరూ వచ్చిఅయ్యా, పూర్వం మీరు రతీదేవికి అభయం ఇచ్చారు. దయచేసి మన్మథుని బ్రతికించండిఅని అడిగారు. అపుడు శంకరుడు పార్వతివంక సంతోషంగా చూశాడు. అంతే మరల మన్మథుడు పుట్టేశాడు. మళ్ళీ జగత్ సృష్టి ప్రారంభం అయింది.
హిమవంతుడు పొంగిపోయి పార్వతీదేవిని దగ్గరకు పిలిచిఅమ్మా ఎంత అదృష్టం నీకు తండ్రిని అయ్యాను. నువ్వు ఈవేళ ఒక ఇల్లాలివి అయిపోయావు, నిన్ను అత్తవారింటికి పంపిస్తున్నాను అని తలమీద నెమ్మదిగా జుట్టంతా రాస్తూ పదిమంది చూస్తుండగా కన్నుల నీరు కార్చేశాడు. ఇప్పుడు అప్పగింతలు పెడుతూ పార్వతీదేవికి సుద్దులు చెప్తున్నారు. తరువాత పార్వతీదేవి వద్దకు చెలికత్తెలందరూ వచ్చారు. అమ్మా నీకు సారె పెడతాము అల్లుడు గారికి కూడా సారె పెట్టాలని ఉంది. కానీ అల్లుడు గారికి సారె పెడదామంటే మా దగ్గరే కాదు ఇంత ఐశ్వర్యవంతమయిన హిమవత్పర్వతం దగ్గరే కాదు శంకరుడికి ఇవ్వగలిగిన వస్తువులు ఎవరి ఇంట్లోనూ ఉండవు అన్నారు. చెలికత్తెలు పరిహాసం ఆడినట్లూ ఉంది, శంకరుడికి ఇవ్వలేనితనమును చెప్తున్నారు. హిమవంతుడు తన ఐశ్వర్యమునకు తగినట్లు కూతురు అత్తవారింటికి వెడుతోందని ఎన్నో కానుకలను ఇచ్చాడు. ఎన్నో పట్టు చీరలను, ఎన్నో బంగారు నగలను, అనేక మత్తగజములను, అనేక అశ్వములను, అనేక పల్లకీలను, అనేక భూములను, పురములను, పుష్పములను, సారెగా ఇచ్చి పంపాడు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనం ఎక్కి కైలాసమునకు బయలుదేరారు. వెనక సరస్వతీ దేవి, చతుర్ముఖ బ్రహ్మ, వారి వెనుక లక్ష్మీ నారాయణులు, శచీదేవి, ఇంద్రుడు బయలుదేరారు. ఇంతమంది దేవతలు కైలాసమును చేరుకున్నారు. పార్వతీ దేవి వచ్చింది కాబట్టి ఇప్పుడు కైలాసంలో నిత్యోత్సవములు ప్రారంభం అయ్యాయి. తరువాత దేవతలు అందరూ శంకరుని వద్దనుండి కానుకలు, తాంబూలములు పుచ్చుకుని స్వస్థానములకు వెళ్ళిపోయారు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాస పర్వతం మీద కూర్చుని అక్కడి నుండి ఎప్పుడూ తమను నమ్మినవారిని, కొలిచిన వారిని, తమకు నమస్కరించినవారిని అలా చూస్తూ, కాపాడుతూ, జగత్తుకి తల్లిదండ్రులై విరాజిల్లుతున్నారు
కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః 
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే 
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున 
ర్భవాభ్యామానందస్సురదనుభవాభ్యాం నతిరియమ్!!
అంటారు శంకరభగవత్పాదులు. కోరి కొలిచిన వాళ్ళకి ఇక్కడే ఉండి రక్షించే మాతాపితరులు లోకములను చల్లగా చూస్తున్నారు.
పార్వతీ కళ్యాణ ఘట్టమును, శివమహాపురాణ ప్రవచనమును ఎవరు విన్నారో, ఎవరు చదివారో, వాళ్ళకు సర్వ కాలములయందు పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది
సర్వం శ్రీ ఉమా మహేశ్వర పదబ్రహ్మార్పణమస్తు!!