Search This Blog

Sunday 17 June 2018


వీణ వైభవం...



‘’వీణా వాదన తత్వజ్ఞః శ్రుతి జాతి విశారదః –తాళజ్ఞశ్చా ప్రయాసేన మోక్ష మార్గం స గచ్చతి ‘’

అని యాజ్న్య వల్క్య స్మృతిలో ఉంది .వీణా వాదన తెలిసి శ్రుతి జాతులలో విశారడుడై తాళం తెలిసినవాడు  మోక్షానికి తేలికగా వెడతారు  అని భావం .వీణ వేదకాలం నాటిదని ‘’రుక్కుల వలన  తెలుస్తోంది .ఆ నాడు తంత్రులున్న యే వాయిద్యానయినా  వీణ అని అనిఉంటారు .ఇప్పుడు మనం వాడే ‘’సరస్వతి వీణ ‘’ఆ నాడు లేదు.24సారికలతో (మెట్లు ) తో మైనపు మేళం తో అన్ని రాగాలను వాయించే వీలున్నదే సరస్వతి వీణ ) .ఇదే తంజావూరు రఘునాధ నాయక భూపాలుని ‘’స్వర రాగ మేళ వీణ ‘’.దీనిపై మునులు ,మేధావులు ఎన్నో ప్రయోగాలు చేశారు . దీనికి ముందున్న వీణలు వాదనకు అనుకూలంగా ఉండేవికావు .’’అనురాగము లేని మనసున సుజ్ఞానం రాదు ‘’అన్నాడు త్యాగ బ్రహ్మ .భ్రుంగి ,నటేశ ,సమీరజ ఘటజ ,మతంగ నారదాదులు పాసించే సంగీత జ్ఞానము ,భక్తీ వినా సన్మార్గము కలదే మనసా ‘’అన్నారు త్యాగరాజ స్వామి .చివరగా ‘’వీణా వాదన లోలుడౌ-శివ మనోవిధ మెరుగరు ‘’అన్నారు త్యాగయ్య చివరగా .శివుని మనసు ఎలా ఉంటుందో ముక్తుడైన వాడి మనసూ అంత శుద్ధంగా ఉంటుంది అని చెప్పారు .

వీణకు 24మెట్లు ,వాటిపై నలుగు తంత్రులు ,ప్రక్కన మూడు తంత్రులు ఉంటాయి .పైనున్న నాలుగు తంత్రులు సారిణి-ఋగ్వేదాన్ని ,మంద్ర త౦త్రి సామ వేదాన్ని ,అను మంద్ర త౦త్రి అధర్వణ వేదాన్ని సూచిస్తాయి .ఈ నాలుగు తంత్రులు శుద్ధ సాత్విక గుణాన్ని కలిగి ఉంటాయి .ఈ 24మెట్లకు ప్రాధాన్యం కలిగేది వాటిల్లోంచి జనించే నాదం వల్లనే తప్ప ప్రాణం లేని లోహం వలన కాదు .ఈ 24తంత్రులు 24అక్షరాల గాయత్రి మహా మంత్రాన్నిచూపిస్తాయి .

మానవ శరీరాన్ని వీణ గా పోల్చారు .మూలాధారం నుంచి శిరస్సు ఊర్ధ్వ భాగం వరకు మానవ శరీరం లోని వెన్ను పూస దీర్ఘంగా నిలిచి ఉంది .శిరస్సు పైభాగమే బ్రహ్మ రంధ్రం .వీణకు 24మెట్లున్నట్లే వెన్నుపూసకూ 24పూసలున్నాయి .వెన్నెముకలో పై నుంచి కింది వరకు 7సెర్వికల్ ,12దోరాసిక్ ,5లు౦బర్ వేర్తిబ్రే లున్నాయి వీణలో పై మెట్లకు వెడుతుంటే దూరం తక్కువగా ఉంటుంది .అలాగే మూలాధారం వైపు వెన్ను పూసలు దట్టంగా  బ్రహ్మ రంధ్రం వైపు సన్నగా ఉంటాయి .మంద్రస్థాయి స్వరం శరీరం అడుగు భాగాన చివరలో జనిస్తుంది ..బ్రహ్మ రంధ్రం వైపు వెళ్ళే కొద్దీ శ్రుతి పెరుగుతుంది .బ్రహ్మ రంధ్రం సహస్రారం లో ఉంటుంది .అక్కడే సంగీతం యొక్క జీవం ఉంటుంది .

ప్రాణాగ్ని సంయోగం చేత నాదోత్పత్తి జరుగుతుంది .తక్కువ శ్రుతిలోమూలాధారం లో అది మొదలై పైకి పోయే కొద్దీ స్వాదిస్టాన,మణిపూర,అనాహత ,విశుద్ధ ,ఆజ్న అనే ఆరు చక్రాలను దాటి సహస్రాన్ని చేరేతంతవరకు శ్రుతి పెరుగుతుంది .

‘’సర్వ దేవా మయీ తస్మాద్వీణేయం సర్వ మంగళా –పునాతి విప్రహత్యాది పాథకైః పతితాన్ జనాన్ ‘’

భయంకర పాతకాలను పోగొట్టే వీణలో సర్వ దేవతలూ ఉండటం చేత వీణ ‘’సర్వ మంగళ ‘’అయిందని భావం .

వీణ అనే ఆంగ్ల గ్రంధం లో శ్రీ జి యెన్ సుబ్రహ్మణ్యం వీణను అనేక దేవతలు స్వాధీన పరుచుకోన్నారని –దండిలో శంభువు ,త౦త్రి లో ఉమా ,కుండ (కకుభం )లో కమలాపతి ,పత్రిక లో లక్ష్మి, తుంబ లో బ్రహ్మ ,నాభి లో సరస్వతి ,దోరికలో వాసుకి ,జీవల లో చంద్రుడు ,మెట్లు (శారికలు )లో సూర్యుడు ఉంటారని తెలియ జేశారు .ఇంతటి దైవ భావం మరే వాద్యనికీ చెప్పలేదు .దేవతలు ఏదైనా వాయిద్యాన్ని వాయించి ఉండచ్చుకాని వాద్యమే దైవం కావటం వీణ విశేషం .

173-120 గంటలు వీణ వాయిస్తే,అది మన శరీరం లో భాగమై పోతుందని సద్గురు శ్రీ శివానంద మూర్తి గారన్నారు .ముత్తు స్వామి దీక్షితులుగారు ‘’మీనాక్షీ ముదం దేహి ‘’కీర్తనను వీణ పై వాయిస్తూ ,నాదైక్యమయ్యారు .’’నాదతనుమనిశం శంకరం ‘’అనేది త్యాగయ్య గొప్ప సాధనా రహస్యాన్ని తెలిపే ఉపనిషద్వాక్యం .

‘’మూలాదారజ  నాద మెరుగుటే –ముదమగు మోక్షమురా –కోలాహల సప్తస్వర గృహముల –గురుతే మోక్షమురా ఓ మనసా ‘’అన్న త్యాగరాజ స్వామి కీర్తనలో బ్రహ్మ సూత్ర భాష్యం ఉంది .అంటూ వీణపై విశేషాలనన్నిటినో తెలియ జేశారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారు .

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మీ బ్లాగ్ చాలా బాగుంటుందండీ. ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.

    ReplyDelete