Search This Blog

Sunday 17 June 2018

ధర్మరాజు స్వర్గారోహణ కథ - DHARMARAJU JOURNEY TO SWARGAM


 ధర్మరాజు స్వర్గారోహణ కథ 




ధర్మమే వెంట వస్తుంది -

కృష్ణ నిర్యాణం తర్వాత ధర్మరాజు పరీక్షిత్తుకు పట్టం కట్టి విరక్తుడై సర్వం త్యజించి సశరీర స్వర్గప్రాప్తికై ఉత్తర దిశగా పయనమయ్యాడు.

ఆహార పానీయాలు వదలి నిర్మోహియైు దిక్కులు చూడక, ఎక్కడా నిలవక హిమాలయంలో బదరీనాథం దాటి అవిశ్రాంతంగా ముందుకు సాగిపోతున్నాడు. నలుగురు సోదరులు, ద్రౌపది కూడా ఆయన్ను అనుసరిస్తున్నారు. అందరూ స్వర్గారోహణ దివ్యభూమిని సమీపించారు.

అక్కడ ద్రౌపది క్రిందకు పడిపోవడం చూచి భీముడు ఆతురుడై అన్నగార్కి నివేదించాడు. ధర్మారాజు వెనుకకు చూడకనే.. ‘పడిపోనీ, పాంచాలి ప్రవర్తన పక్షపాతమయం. ఆమెకు మన నల్గురికంటే అర్జునుని మీద మక్కువ ఎక్కువ’ అంటూ నిర్లిప్తంగా ముందుకు నడిచాడు. కొద్దిసేపట్లోనే సహదేవుడు పడిపోవడం చూచి భీముడు హెచ్చరించగా - ‘సోదరా! మాద్రీ పుత్రుడు పాండిత్య మద పూర్ణుడు’.. అని పల్కి ధర్మరాజు వెనక్కి చూడక మిగిలిన వారితో ముందుకు సాగాడు. తర్వాత నకులుని పతనం తెలపగా ధర్మరాజు - ‘భీమా! అతనికి తాను అందరికంటే అందగాడిననే అహంకారం. అందుకే పడిపోయాడు’ అని వెనుతిరుగకనే వివరించాడు.

ఇంతలోనే పాండవ మధ్యముని పతనం ప్రారంభమవగా భీముడు భయం-భయంగా, అన్నా! మన ప్రియతమ సోదరుడు గాండీవధారి పార్థుడు కూడా పడిపోతున్నాడని చెప్పగా యుధిష్ఠిరుడు.. ‘పడనీ. నేను గొప్ప విలుకాడినని, విజయుడు ఎప్పుడూ విర్రవీగేవాడు’ అంటూ ముందుకు సాగాడు.

చివరకు ‘అన్నా! నేనూ పడిపోతున్నా అడ్డుపడమ’ని భీముడు ఆక్రోశించగా.. ‘భీమా! నువ్వొక పెద్ద తిండిపోతువి. ఈ లోకంలో నాకన్నా బలవంతుడు లేడని నీకూ అహంకారం. దురభిమానికి పతనం తప్పదు’ అంటూ ఆగక సాగిపోయాడు. అందుకే ‘అభిమానం సురాపానం’.. అంటే అహంకారం మద్యపానంతో సమానమని శాస్త్రం హెచ్చరించింది.

స్వర్గారోహణ శిఖరానికి చేరువౌతున్న ధర్మరాజు, తాను ఒంటరి వాణ్ణి కానని, ఆది నుంచి తనను అనుసరిస్తూన్న ఒక కుక్క తన వెంట ఉన్నదని గుర్తించాడు. శిఖరానికి చేరగానే ఇంద్రుడు ప్రత్యక్షమై ధర్మసుతుని సశరీరంగా స్వర్గానికి ఆహ్వానిస్తూ దివ్యరథాన్ని అధిరోహించాలని కోరగా ధర్మరాజు ‘మహేంద్రా! మొదట నన్నాశ్రయించి వచ్చిన కుక్కను రథమెక్కనివ్వండి, ఆ తర్వాత నేను ఎక్కుతాను’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు.. ‘ధర్మరాజా! శునకానికి స్వర్గలోక ప్రవేశార్హత లేదు. కుక్కను పెంచే వారికీ స్వర్గంలో స్థానం లేదు. ‘స్వర్గే లోకే శ్వవతాం నాస్తి ధిష్ణ్యం’. ఈ క్షుద్ర జీవి నన్ను చూడగల్గటమే గొప్ప.

స్వర్గప్రాప్తి పుణ్యఫలం. ఈ జీవి పుణ్యాత్ముడైతే కుక్కగా ఎందుకు పడతాడు?’ అన్నాడు. ఐతే స్వర్గంతో నాకూ పనిలేదన్నాడు ధర్మజుడు.

‘ఇంద్రా! నా వారంతా నన్ను వదిలివెళ్లిపోయినా వదలక వెంట వచ్చిందీ ఈ శునకం.

నేను దీన్ని పెంచలేదు. ఇదే నన్నాశ్రయించింది. ఆశ్రితుని (శరణాగతుని) త్యజించడం అధర్మం. నేను నా పుణ్యంలో సగభాగం దీనికి ధారపోస్తున్నా.

ఇదీ నాకు తోడుగా వస్తుంది’ అన్నాడు ధర్మరాజు. వెంటనే శునక రూపంలో ఉన్న ధర్మదేవత సాక్షాత్కరించి ప్రసన్నుడై ధర్మస్థిరుడైన యుధిష్ఠిరుని ముందు నిలిచి, నాయనా! ధర్మపరీక్షలో నీవు నెగ్గావు. సశరీర స్వర్గప్రాప్తికి అర్హుడయ్యావని ఆశీర్వదించాడు. కనుక, మృతదేహాన్ని ఏదో కొయ్య ముక్కో, మట్టిగడ్డో పారేసినట్లుగ నేల మీద పడేసి బంధుమిత్రులంతా విముఖులై వెళ్లిపోతారు, ఆ వ్యక్తి చేసిన ధర్మమొక్కటే అనగా పాప పుణ్యాలు మాత్రమే వెంట వెళుతాయి. మృతునికి ధర్మమే మిత్రము.

ధనాన్ని భూమి ,బీరువాలు, బ్యాంకులలోను,
పశువుల్ని గొడ్ల పాకల్లోను,
భార్యను ఇంటి గుమ్మంలోను,
బంధుమిత్రులను శ్మశానంలోను,
దేహాన్ని చితి మీదను, గోతిలోను,
వదలి జీవుడు పరలోక మార్గంలో పోయేటప్పుడు
ధర్మమొక్కటే అతని వెంట ఉంటుంది.

సర్వేజనా సుఖినో భవంతు

1 comment:

  1. ధర్మో రక్షతి రక్షితః జై dharmadeva!

    ReplyDelete