త్రిపురాసుర సంహారం - పార్ట్ 1
త్రిపురాసురవృత్తాంతం శంకరుడి లీలలలో ఆయన చేసిన రాక్షస సంహారములలో చాలా ప్రధానమయినదిగా చెప్పబడుతుంది. దీనికి ఉన్న స్థాయి బహుశ ఏ ఇతర రాక్ష సంహారమునకు లేదు. ప్రత్యేకించి శంకరుడు చేసిన రాక్షస సంహారములలో ఇతరమయిన వాటికి త్రిపురాసుర సంహారముతో సమానమయిన ప్రతిపత్తిని ఇవ్వరు. త్రిపురాసురసంహారం అనేది ఒక గమ్మత్తు. ఎందుచేతనంటే అమ్మవారిని మనందరం సాధారణంగా పిలిచే పేరుత్రిపురసుందరి. ఆయన త్రిపురాంతకుడు. వీరిద్దరూ ఆదిదంపతులు. ఇద్దరి విషయంలోనూ త్రిపుర’ అనే మాటను అనుసంధానం చేస్తారు. ఇంకా చెప్పాలంటే అమ్మవారికి ‘త్రిపుర’ అనే పేరు కూడా ఉంది. శంకరుడిని త్రిపురాంతకుడు అంటారు. అనగా త్రిపురములను అంతము చేసినవాడు అని అర్థం. త్రిపురాసురుల ముగ్గురు పేర్లను పురాణం ప్రక్కన పెట్టింది. లోకంలో సాధారణంగా త్రిపురాసుర సంహారం జరిగింది అని చెప్తారు. ఇందులో ముగ్గురికీ విడివిడిగా పేర్లు ఉన్నాయి. కానీ ఎవరి పేరు వారికి పెట్టి వాడిని అంతం చేసిన వాడిగా శివుడిని పిలవరు. ‘త్రిపురాంతకుడు’ ‘త్రిపురారి’ అని పిలుస్తుంటారు. అసలు అలాంటి పేరు ఎందుకు వచ్చిందో పరిశీలిద్దాం.
తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చేతిలో నిహతుడయిన రాక్షసుడు. లోకములను చాలాకాలం బాధపెట్టినవాడు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడి పేరు తారకాక్షుడు. రెండవవానిపేరు కమలాక్షుడు, మూడవ వాని పేరు విద్యున్మాలి. ఈ ముగ్గురికీ తండ్రి తారకాసురుడు. తారకాసురుడు తనకు చావురాదని ధైర్యమును ఎందుకు పెంచుకున్నాడు? పరమశివుడికి వీర్యము స్కలనమయితే దానివలన ఆయనకు కుమారుడు పుడితే ఆ కుమారుడి వలన తాను మరణించాలని కోరుకున్నాడు. ఆయన నమ్మకమేమిటంటే శంకరుడు కామారి. కాముని పట్ల శత్రుత్వమున్న వాడు. ఆయన కామమునకు లొంగడు. కనుక వీర్యము స్కలనం కాదు. అందువలన శంకరునకు కొడుకు పుట్టడు. కొడుకు పుట్టడుకాబట్టి తనకు మరణం లేదు అని భావించాడు. మరణం లేకుండా ఉండడం కుదరదని బ్రహ్మగారు అన్నారు కాబట్టి ఆయన ఇంకొక వైపునుండి నరుక్కు వచ్చారు. ఇంత ప్రయత్నం చేసినా సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించనే ఆవిర్భవించాడు – తారకాసుర సంహారం జరగనే జరిగింది.
కానీ ఆయన ముగ్గురు కొడుకులకు బుద్ధి రాలేదు. వాళ్ళు ముగ్గురు మళ్ళీ బ్రహ్మగారి కోసం తపస్సు మొదలుపెట్టారు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ‘మీకు ఏమి కావాలి?’ అని అడిగారు. వారు తమకి చావు లేకుండా ఉండాలని కోరారు. బ్రహ్మగారు ‘ ఆత్మకి చావు లేదు. శరీరము చావకుండా ఉండలేదు. మరణం అనేది జగత్తు ధర్మము. ఈ శరీరము జగత్తులో అంతర్భాగము. మరణం లేకుండా ఈ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం అనేది కుదరదు’ అని చెప్పాడు. ఇది విన్న వాళ్ళు బ్రహ్మగారితో “సరస్సులోంచి పుట్టిన దాంట్లోంచి పుట్టిన వాడా – నీవు మేము అడిగింది ఇవ్వలేవు. మేము ఈ శరీరంలో శాశ్వతంగా ఉండేట్టుగా వరమునీయవలసినది అడుగుతున్నాము. నీవు అది కుదరదని అంటున్నావు. నీవు మాకు సంపదనిచ్చినా దానిని అనుభవించడానికి అసలు ఈ శరీరమునకు ఆయుర్దాయము ఉంటే కదా!’ అన్నారు. అప్పుడు బ్రహ్మగారు నేను మీకు మరణం లేకుండా ఉండేలా వరం ఇవ్వలేను. కానీ మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారో చెప్పినట్లయితే అలా వరం ఇవ్వగలను’ అన్నారు. అప్పుడు వారు ‘నీవు మయుడిని పిలిపించి ఒక బంగారు నగరమును, ఒక వెండి నగరము, ఒక యినుప నగరమును నిర్మింప జేయి. మా ముగ్గురు అన్నదమ్ములం ఆ మూడింటిలో ఎక్కుతాము. అవి మూడూ ఆకాశంలో ఆగకుండా తిరుగుతుండాలి. మాకు అందరినీ ఓడించగల శక్తి ఉండాలి. అలా తిరుగుతూ మేము భోగములన్నీ అనుభవిస్తాము. ఈ మూడు పురములు ఎప్పుడూ ఒక సరళరేఖలోకి రాకూడదు. వెయ్యి దివ్య సంవత్సరములకు ఒక్క క్షణం సేపు మాత్రం ఈ మూడు పురములు ఒకే సరళరేఖలోకి వచ్చి నిలబడాలి. ఇలా నిలబడినప్పుడు మిట్టమధ్యాహ్యం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా పుష్కలా వర్తక మేఘములలోంచి వర్షము కురుస్తుంటే ఇతః పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కొత్త రథం ఎక్కి ఇతః పూర్వం లోకంలో ఎవరూ పట్టుకోని ఒక అపూర్వమయిన ధనుస్సు పట్టుకుని ఒకే బాణంతో దేవతాసార్వభౌముడు అయినవాడు కొట్టేస్తే అప్పుడు మేము చనిపోతాము. ఆ క్షణంలో ఒక్క బాణంతో అటువంటి రథం మీద ఎక్కి అటువంటి వాడు కొట్టకపోతే మరల మేము బ్రతికేస్తాము. కాబట్టి అలా మాకు వరం ఇవ్వవలసినది’ అని అడిగారు. అపుడు బ్రహ్మగారు తథాస్తు అన్నారు.
వెంటనే వారు దేవలోకము మీదికి దండయాత్ర చేసి దేవతలనందరిని ఓడించి వాళ్ళనందరిని వీళ్ళు చెప్పినట్లుగా చేయవలసినదని ఆజ్ఞాపించారు. ఈవిధంగా వారు ప్రకృతిని శాసించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘మహానుభావా మీరు వరం ఇచ్చేశారు. వాళ్ళు చాలా ఉద్ధతితో ఉన్నారు. లోకములను బాధపెట్టేస్తున్నారు. దీని నుంచి బయటపడడం ఎలాగ? దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి’ అని అడిగారు. అపుడు ఆయన ‘నాయనలారా, ఇప్పుడు వాళ్ళ దగ్గర మూడు బలములు ఉన్నాయి. వరబలం, సహజమైన శరీరబలం, శివపూజ వలన వచ్చిన బలం. అటువంటి పరిస్థితులలో వాళ్ళమీదికి వెళ్తే ఓడిపోతాము. కాబట్టి శివుడి దగ్గరకు వెళదాము’ అన్నాడు.
No comments:
Post a Comment