Search This Blog

Sunday 11 February 2018

SIVAMAHAPURANAM - PARVATI KALYANAM - PART VII - 40


పార్వతీ కళ్యాణము – పార్ట్ 7

కొన్ని కోట్లమంది అన్ని లోకములనుండి పెళ్ళికి బయలుదేరి పోతే బరువు ఒక్కచోటికి వెళ్ళిపోయేటప్పటికీ ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఒక పక్కకి వంగిపోయాడు. సమయంలో దేవతలందరూ శంకరుని దగ్గరకు వచ్చిశంకరా, ఇప్పుడు నీ నిజరూపమును చూసి పరిపూర్ణమయిన మనస్సుతో మేనకా హిమవంతులు పరవశించి పోయి కన్యాదానం చేసేస్తారు. అలా చేయగానే మోక్షం వచ్చేసి వారికి రూపం పోతుంది. అప్పుడు హిమశైలం ఉండదు. హిమశైలం అనేక రత్నములకు, బంగారమునకు ఆలవాలం. శైలం మీద ఎందఱో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. అది లేకపోతే భూమికి శోభ ఉండదు. కానీ నీకు నిండు మనస్సుతో కన్యాదానం చేయకుండాఏమిటి బాబోయ్ ఇలాంటి అల్లుడు వచ్చాడుఅనే అర్థ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్లుగా వాళ్ళ మనస్సు నీవే మార్చు శంకరాఅని అడిగారు. అపుడు శంకరుడు మీ అందరికీ హిమవత్పర్వతము కావలసివస్తే తప్పకుండా నేను అలాగే ప్రవర్తిస్తానుఅన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు
ఈలోగా హిమవంతుడు తానూ శుభలేఖలు వేయించి బంధువులందరికీ పంపించాడు. ఆయన తన కుమార్తె పెండ్లి శుభలేఖలను లోకములన్నిటిలో ఉన్న పర్వతములన్నిటికీ పంపించాడు. హిమవంతుడు ఎంత గొప్పగా తన కూతురి వివాహం చేస్తాడో చూడాలని పిలవబడిన పర్వతములన్నీ తమతమ కుటుంబములు, బంధు మిత్రులతో బయలుదేరాయి. పెళ్ళికి నదులన్నీ వచ్చాయి. నదులతో పాటు రాజ్యములు, అరణ్యములు, అన్నీ బయలుదేరాయి. ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణమునకు హిమవత్పర్వతము మీదికి చేరుకున్నారు
వీళ్ళందరినీ చూసి హిమవంతుడు పొంగిపోయాడు. తన పురమును చక్కగా అలంకరింపచేశాడు. ఇళ్ళముందు సువాసనలతో కూడిన జలములను ప్రతి వీధిలో జల్లారు. ముత్యములతో ముగ్గులు పెట్టారు. ప్రతి ఇంట్లో హేమకుంభములను ఎత్తారు. శంకరుడు చూసి పొంగిపోవాలని నందీశ్వరుని పటములను గీసి ఊరు ఊరంతా పెట్టేశారు. ఎవరికి వచ్చిన వాద్యములు వారు వాయిస్తున్నారు. ఈలోగా పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడన్నారు. హిమవంతునితో ఎదురు సన్నాహమునకు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఈలోగా మేనకాదేవికి దూరం నుంచి అల్లుడిని ఒకసారి చూద్దామని అనిపించింది. అంతఃపుర గవాక్షం నుంచి చూస్తూనారదా వచ్చే వారిలో మా అల్లుడు ఎవరో చెప్పవలసినదిఅని అడిగింది. నారదుడు చాలా తమాషా అయిన మనిషి. ఎప్పుడూ లోకకళ్యాణం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు. భూతప్రేత గణములు వస్తున్నాయి. వాటి మధ్యలో ఒంటిమీద బట్ట లేకుండా దిగంబరుడై పుర్రెల మాల వేసుకుని, ఒకాయన ఎగురుతూ ఆడుతూ వస్తున్నాడు. ఆవిడ మొహం తిప్పుకుంది. అపుడు నారదుడుఅలా మొహం తిప్పుకుంటావేమిటిచూడు ఆయనే మీ అల్లుడుఅని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఆవిడ వెంటనే బాధతో అంతఃపురంలోకి వెళ్ళి పార్వతీ దేవిని పిలిచి ఇందుకోసం తపస్సు చేశావా? అని అడిగింది. పార్వతీదేవి అమ్మా, నీకు వచ్చిన బాధ ఏమిటి? అని అడిగింది. మేనకాదేవిఅమ్మా, వాడు పెళ్ళికొడుకు ఏమిటి? ఒంటి మీద బట్ట కూడాలేదు. ఆయన అల్లుడేమిటి? ఎగురుడు ఏమిటి? నాట్యం ఏమిటి? ఇంతమంది జనంలో ఒక్కడూ నచ్చలేదా నీకు! దిగంబరుడు నచ్చాడా? ఒక్కనాటికీ నిన్ను వీనికిచ్చి కన్యాదానం చేయనుఅని చెప్పింది. ఇపుడు దేవతలు కోరిన కోరిక తీరిపోయింది
అందరూ విడిదికి వెళ్ళిపోయారు. తరువాత శంకరుడు మరల స్వస్వరూపమును పొందేశాడు. ఇప్పుడు మేనకాదేవిని ఎదురు సన్నాహమునకు వెడదాము రమ్మనమని కబురు చేస్తే తాను ఒక్కనాటికీ రానని చెప్పింది. పార్వతీదేవి అయ్యో ఇదేమిటి చిట్టచివరకు వచ్చి స్వామి మరల ఇలాంటి మెలికపెట్టారు. అది దేవకార్యము అని తెలుసుకుంది. అప్పుడు మళ్ళీ అరుంధతీదేవి వచ్చింది. ఆమె మేనకాదేవితోఅమ్మా, పిచ్చిదానా, నీకు శంకరుడంటే ఏమి తెలుసు? ఆయన కృపాళువు. మహానుభావుడు. ఆయన దేవతలకార్యమై ఇలా చేయవలసి వచ్చింది. శంకరుని సహజమయిన రూపం అది కాదు. నిజంగా శంకరుడు ఎలా ఉంటాడో చూడడానికి నీవు ఎదురు సన్నాహంలో మధుపర్కం పట్టుకుని పెద్దలయిన వాళ్ళతో కలిసి వెళ్ళి చూడు అని చెప్పింది. ఇపుడు మేనకాదేవి ఎదురు సన్నాహంలో పెద్దలతో కలిసి వెడుతోంది. కానీ అల్లుడు ఎలా వస్తాడో ఏమిటోనని రుసరుసలాడుతోంది. అటునుంచి శంకరుడు పెళ్ళికుమారుడిగా వస్తున్నాడు
కోటి సూర్యప్రకాశం సర్వావయవ సుందరంవిచిత్రవసనంచ్ఛాదా నానాభూషణ భూషితంఅయి ఆయన విడిదిలోంచి బయటకు వచ్చే ముందే కోటి సూర్యుల కాంతి వచ్చింది. ఇప్పుడు బంగారు సరిగంచు పంచె కట్టాడు. అటువంటి ఉత్తరీయం వేసుకున్నాడు. అనేకమయిన భూషణములు ధరించాడు. బంగారు కంకణములు, హారములు, కేయూరములు అన్నీ పెట్టుకుని వస్తున్నాడు. వస్తున్నా శంకరుని నిజ స్వరూపం ఇది. నవ్వుతూ ఉన్నాడు. ముట్టుకుంటే కందిపోతాడేమో అనేలా ఉన్నాడు. చిన్ని చిరునవ్వు నవ్వుతున్నాడు. సూర్యుడు గొడుగు అయ్యాడు. చంద్రుడు గొడుగుకి దండం అయ్యాడు. శంకరుడు వస్తున్నప్పుడు గంగాదేవి, యమునాదేవి ఇద్దరూ రెండు పక్కలా శంకరుడికి వింజామరలు వీస్తూ వస్తున్నారు. ఇలా బయలుదేరి వచ్చేసరికి మేనకాదేవి చూసి పొంగిపోయింది. కానీ చిన్న అనుమానం. త్రికరణ శుద్ధి లేకపోవడం వలన హిమవంతుడిని పరమాత్మ అట్టేపెట్టాడు. ఇప్పుడు పెళ్ళికొడుక్కి ఎదురు వచ్చి వీళ్ళందరూ ఆయనకు నమస్కారం చేశారు. మేనకాదేవి ఆయన అందం, లావణ్యం, చూసి మురిసిపోయింది. ఇప్పటివరకు మూతులు తిప్పిన వాళ్ళందరూ అమ్మ బాబోయ్శంకరుడు ఎంత చమత్కారోఅని అనుకున్నారు. స్వామికి మధుపర్కం ఇచ్చి, మేళతాళములతో దేవతలనందరినీ తోడ్కొని అంతఃపురంలోకి తీసుకుని వస్తున్నారు. అలా తీసుకు వస్తుంటే శ్రీమహావిష్ణువు శంకరుని దగ్గరకు వచ్చిశంకరా, మొత్తం అన్ని లోకములలో ఉన్న దేవతలు, దానవులు దైత్యులు యక్షులు కిన్నరులు కింపురుషులు సాధ్యులు సిద్ధులు పర్వతములు నదులు సముద్రములు జంతువులు సమస్త చరాచర ప్రపంచము ఇక్కడికి నీ పెళ్ళికి వచ్చేసింది. దానితో దక్షిణదిక్కు పైకి లేచిపోయింది. ఉత్తర దిక్కు వంగిపోతోంది. దక్షిణదిక్కు పెళ్ళి నేనెందుకు చూడకూడదన్నట్లు క్షణక్షణమునకు పైకి లేచిపోతోంది. భూమిని ఇప్పుడు సమతలం చేయాలి. మీరు తొందరపడి ఏదో ఒకటి చేయండిఅన్నాడు. శంకరుడు అన్నాడుసముద్రమును ఆపోశనపట్టినవాడు, అపారమయిన శక్తి సంపన్నుడు, లలితాసహస్రనామ స్తోత్రమును ఉపదేశం పొందినప్పుడు శ్రోత, పంచాక్షరీ మహా మంత్రమును కొన్ని కోట్లు చేసినవాడు, మహానుభావుడి ఆశ్రమంలో పులులు, ఆవు దూడలు కలిసి ఆడుకుంటాయో మహానుభావుడు నడిచి వెడుతుంటే సమస్త జగత్తు నమస్కారం చేస్తుందో, ఎవడు ఒక్కసారి కడుపు మీద రాసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్న వాడో అటువంటి వాడు, నాకు మహాభక్తుడు అయిన అగస్త్యుడి దివ్యమయిన బరువు ఒక్కటిచాలయ్యాఅందుకని అగస్త్యుడిని దక్షిణ దిక్కుకు వెళ్ళమనండి. అపుడు భూమి మళ్ళీ కుదురుకుంటుంది. ఆయన దివ్యతేజస్సు అటువంటిదిఅన్నాడు. అపుడు అగస్త్యుడు శంకరా, నాకు నీ కళ్యాణం చూసే భాగ్యం లేదా? అని అడిగాడు. అపుడు శంకరుడు నీకు తప్పకుండా నా కళ్యాణం గోచరం అవుతుంది వెళ్ళవలసినది అని చెప్పారు. ఆనాడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు. భూమి సమతలంగా నిలబడింది
ఇప్పుడు పెళ్లి మంటపంలోకి శంకరుడిని తీసుకువెళ్ళి పెళ్ళి కొడుక్కి, పెళ్ళి కూతురుకి మంగళ స్నానములు చేయించాలి. పార్వతీ దేవికి మంగళ స్నానం చేయిస్తున్నారు. ఇలాంటివి విన్నంత మాత్రం చేత ఇంటికి తోరణములు నిలబడతాయి. పార్వతీ దేవి మంగళ స్నానం అంటే మాటలు కాదు. అది అభిషేకం కాదు. అమ్మవారికి చక్కగా నూనె పెట్టించి, వొళ్ళు నలిపించి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించారు. కళ్యాణ మండపం చుట్టూ చక్కగా ముగ్గులు పెట్టారు. రత్నపీఠం తెచ్చి దాని మీద పార్వతీదేవిని కూర్చోపెట్టారు. అమ్మవారికి ముత్తైదువలందరూ అక్షతలు వేసి తలస్నానం చేయిస్తున్నారు. పెద్ద ముత్తైదువలు వచ్చి కుంకుడు పులుసు పోస్తుంటే తల్లిగారు స్వయంగా అమ్మవారి తల రుద్దింది. ఏమి తల అది. జుట్టు కనపడితే చాలు అజ్ఞానం పోతుంది. ఏమీ తెలియని దానిలా అందరి మెడలలో మంగళ సూత్రములు నిలబడడానికి కారణం అయిన సర్వమంగళ రోజున తానే పెళ్ళికూతురు అయింది. తలస్నానం చేయించి పొడి బట్టతో చక్కగా ఒళ్ళంతా తుడిచారు. అనేక రత్నహారములు, అలంకారములు చసి అమ్మవారికి పట్టుబట్టలు తొడిగారు. పేరంటాండ్రు అందరూ వచ్చేసరికి తల్లిని తీసుకువచ్చి అక్కడ కూర్చోపెట్టారు. రత్నాలంకారములన్నీ చేసి అమ్మాయిని కూర్చోపెట్టాక మేనకాదేవికి బెంగ కలిగింది. మా అమ్మాయి ఇంత అందగత్తె. దిష్టి తగిలిపోతుందేమోనని ముఖం కనపడకుండా ఎక్కువ అలంకారం చేసేయమని మేనకాదేవి చెప్పేసరికి అక్కడి స్త్రీలు ఆమెకు అలా అలంకారం చేసేశారు. అమ్మవారిని బుట్టలో కూర్చోబెట్టి బ్రహ్మగారు ముందు, లక్ష్మీనారాయణులు పక్కన నడుస్తుండగా అమ్మవారిని తీసుకుని మేళతాళములతో పువ్వులు జల్లుతుండగా అక్కడికి తీసుకు వచ్చారు.

No comments:

Post a Comment