పార్వతీ కళ్యాణము – పార్ట్ 1
ఒక పురాణకథను చదివేటప్పుడు అది మనకు ఏ విషయమును బోధ చేస్తోంది అనే విషయమును సమగ్రంగా పట్టుకునే ప్రయత్నం చేయకపోతే దానివలన ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. ఆ కథను చదవడం వలన మీరు ఎన్నో విషయములను తెలుసుకోవలసి ఉంటుంది. ఆ విషయములను తెలుసుకుని ప్రవర్తించడం చాలా ముఖ్యం.
ఒకానొక సమయంలో ప్రజాపతులందరూ సత్రయాగం చేస్తున్నారు. ఆ యాగమునకు ఎందఱో పెద్దలు వచ్చారు. ఆ వచ్చినవారిలో చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు కూడా ఉన్నారు. మహానుభావుడు శంకరుడు త్రిమూర్తులయందు ఒకడు. ఒకచోట ఆయనే త్రిమూర్తులుగా ఉన్నవాడు. కాబట్టి ఆయనకు ఆసనం వేసి కూర్చోబెట్టారు. సభలో ఎవరు వచ్చినపుడు ఎవరు నమస్కరించాలి అన్నది తెలిసి ఉంటే అది వినయం అవుతుంది. తెలియకపోతే అది అహంకారమునకు కారణం అవుతుంది. అందరూ ఆయనకు నమస్కరించారు. అందరూ కూర్చున్నారు. చక్కగా యాగం జరుగుతోంది. యాగమునకు వచ్చిన వాళ్ళలో బ్రహ్మగారు, అనేక యోగులు, ఋషులు, ఎందఱో మహానుభావులు ఉన్నారు. ఆ యాగమునకు వీళ్ళందరూ పరమభక్తితో వచ్చారు. వీరందరూ కూర్చుని ఉండగా ఒక్కసారి అనేక సూర్యులు వెలుగుతుంటే ఏలాగున ఉంటుందో అంత ప్రకాశంతో ఆ సభలోకి దక్షప్రజాపతి ప్రవేశించాడు. దక్షప్రజాపతికి ఒక గొప్పతనం ఉంది. ఆయన సాక్శాత్తు బ్రహ్మగారి బొటనవ్రేలినుండి పుట్టాడు. సృష్టిలో బ్రహ్మగారి తరువాతి స్థానంలో ప్రజాపతులుంటారు. ఇప్పుడు దక్షప్రజాపతిని ఒక విషయం ఆవహించింది. అది నేను సభలోకి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడి నాకు నమస్కారం చేయాలి అని భావించాడు. ఆయన లోపలి వచ్చేసరికి ఆ సభలో ఉన్నవారిలో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారు. అలా లేచి నిలబడని వారిలో ఒకరు బ్రహ్మగారు, రెండవ వారు భర్గుడు. ఆయన అహంకారం తృప్తి పొందలేదు. శంకరుడు తన అల్లుడు. కాబట్టి లేవాలి అని అనుకున్నాడు. విపరీతమైన కోపం వచ్చింది. ఈ కోపమును కడుపులో పెట్టుకున్నాడు. అక్కడ సత్రయాగం జరుగుతోంది. తానొక ప్రజాపతినని, తానలా ప్రవర్తించకూడదనే విషయమును మర్చిపోయి శంకరుని దూషించడం ప్రారంభించాడు. ఈ మాటలను వింటూ శంకరుడు నవ్వుతూ కూర్చున్నాడు. దీనిని చూసి దక్షునికి ఇంక కోపం మింగుడు పడలేదు. నేను ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నాను అని దక్షుడు అక్కడినుండి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు.
అక్కడ మధ్యలో అనవసరంగా లేచి అరిచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు నందీశ్వరుడు, రెండవవాడు భ్రుగువు. భ్రుగువుకు కొంచెం అహంకారం ఎక్కువ. అందుకే శ్రీమహావిష్ణువు ఆయన అరికాలు కన్ను నొక్కేశారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకరు శివ సంబంధంగా, ఒకరు విష్ణుసంబంధంగా రెండు జట్లు కట్టారు. ఒకరిమీద ఒకరు బురదజల్లుకున్నారు. దీనిని చూస్తూ నవ్వుతూ కూర్చున్న వారు బ్రహ్మ, శంకరుడు. పిల్లవాడి అజ్ఞానమును తండ్రి మన్నించినట్లు వాళ్ళు వీరి అజ్ఞానమును మన్నించి నవ్వుతూ ఊరుకున్నారు. ఇప్పుడు దక్షుడు శంకరుడిని అవమానించాలి అనుకుని అందుకుగాను నిరీశ్వరయాగం చేయాలని సంకల్పించుకున్నాడు. ఆ యాగమునకు అందరినీ పిలిచాడు. అందరూ ఆ యాగమునకు బయలుదేరి వెళుతున్నారు. వాళ్ళందరినీ పలకరించి మర్యాదలు చేస్తున్నాడు దక్షుడు.
కైలాసపర్వతం మీద అంతఃపురంలో సతీదేవి నిలబడి ఉంది. పైనుండి విమానములు వెళ్ళిపోతున్నాయి. ఏదో పెద్ద ఉత్సవమునకు వెళ్తున్నారని తెలిసిపోతోంది. ఆవిడని వదిలిపెట్టి మిగిలిన వారందరికీ దక్షుడు ఆహ్వానములు పంపాడు. ఇది అమ్మవారికి ఖేదకారణం అయింది. ఆవిడ ఆవేదనను నారదుడు గమనించి సతీదేవి వద్దకు వచ్చి ‘తల్లీ, నీకు తెలియని విషయం కాదు. కానీ చెప్పకపోతే నాది దోషం అవుతుంది. నీ జనకుడయిన దక్షప్రజాపతి ఈవేళ ఒక యాగం చేస్తున్నాడు. ఆయన మదము చేత అంధుడై ఎవరికి గౌరవం ఇవ్వాలో తెలుసుకోలేని బ్రతుకు బ్రతుకుతున్నాడు. దక్షుడు చాలా పెద్ద తప్పు చేశాడు’ అని చెప్పాడు.
నారదుని మాటలు విన్న సతీదేవి ఏమీ మాట్లాడలేదు. నేనేమి చేయాలి? అని ఆలోచించింది. శంభునియందు ఏ దోషమూ లేదు. అందువలన తన తండ్రి చేసిన దుష్కృత్యమును తాను పరిష్కరించాలని భావించింది. అమ్మవారు బయలుదేరి శంకరుడి దగ్గరకు వెళ్ళి ‘మహానుభావా, శంకరా, దక్షుడు మర్యాదాతిక్రమణం చేశాడు. మీరులేని యాగం చేస్తున్నాడు. నాథా, ఈ లోకమునకంతటికీ బుద్ధి చెప్పాలి. దక్షుడికి బుద్ధి చెప్పవలసిన వాళ్ళు ఆయనకు బుద్ధి చెప్పడం మానేసి ఆయన చేస్తున్న యాగమునకు వెళ్ళారు. వాళ్ళకి శిక్ష వేయడానికి శక్తి రూపంగా నేను వెడుతున్నాను అని అనుకుని ‘నా నాథుడవయిన నిన్ను పిలవలేదు. కాబట్టి ఆ యాగం జరగడానికి వీలు లేదు. నాకు కూడా మీతో కలిసి వెళ్లాలని ఉన్నది దయచేసి నా కోర్కె తీర్చవలసింది. ఆ యాగమునకు నా చెల్లెళ్ళు అందరూ వారి భర్తలతో కలిసి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మనము ఆ యాగమునకు వెడితే ఒకసారి అందరినీ చూసినట్లు ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా రారా’ అని అడిగింది. మనలను పిలవలేదు దేవీ, అల్లుడిని పిలవాలిగా మరి నన్ను ఆహ్వానించ లేదుగా పిలవని చోటికి నేను వెళ్ళవచ్చునా అది దోషం అవుతుంది కదా అని అంటారేమో తండ్రిగారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు అన్నది.
అపుడు శంకరుడు ఒక చిరునవ్వు నవ్వి ‘దేవీ, పిలవకపోయినా వెళ్ళవచ్చుననునది పరమధర్మము. హఠాత్తుగా శుభకార్యం జరుగుతూ పిలవలేకపోతే వెళ్ళవచ్చు. కానీ మీ నాన్న కావాలనే మనలను పిలవలేదు. నీ ఆప్యాయతను వాళ్ళు పట్టించుకోరు. సజ్జనుడు అయినవాడు ప్రేమతో సజ్జనుడిగా ప్రవర్తించినా దుర్జనుడయినవాడు ఆ ప్రేమను చూడలేడు. వాడి కడుపు మంటతోనే ఉంటుంది. వాడు అవమానించదానికే ప్రయత్నిస్తాడు. కాబట్టి నీకొక విషయం చెప్తాను బాగా విను. బ్రహ్మగారు సత్రయాగం చేసినప్పుడు జరిగిన విషయం చెప్పాడు. అది ఇవాళ ఈ స్థితికి వెళ్ళింది. ఇపుడు నీతండ్రి కక్షమీద ఉన్నాడు. నీ మనస్సు ఖేదపడేటట్లు మాట్లాడతాడు. కాబట్టి నిన్ను వెళ్ళవద్దనే చెప్తాను. అన్నాడు.
అపుడు ఆవిడ నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నది. శంకరుడు తప్పకుండా వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు ఆ తల్లి భర్త మాట కాదని వెళ్ళవలసి వస్తోంది అని కన్నుల నీరు కారుస్తూ గబగబా అక్కడినుండి బయలుదేరింది. ఈమె అలా వెళ్ళిపోతుంటే ప్రమథగణములు చూడలేకపోయాయి. నందీశ్వరుని తీసుకువెళ్ళి ముందు పెట్టి కొన్ని కోట్ల ప్రమథగణములు ప్రక్కన నిలబడి ఘంటారావములు చేస్తూ వేణు నాదములు చేస్తూ జయహో జయహో అంటూ అందరూ కలిసి మంగళప్రదంగా దక్షయజ్ఞమునకు బయలుదేరారు. విమానం దిగి అమ్మవారు యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అక్కడికి వచ్చిన సతీదేవిని తల్లి, సోదరులు తప్ప మిగిలిన వారెవ్వరూ పలకరించలేదు. ముఖములు ప్రక్కకి తిప్పుకున్నారు. సతీదేవి చాలా అవమానమును పొందింది. సభలో అంతమంది పెద్దలు ఉన్నారు. ఆవిడ లేకుండా అసలు యజ్ఞం లేదు. అటువంటి తల్లి ఈవేళ యజ్ఞమునకు బయలుదేరి వస్తే ఆమెను పలకరించే వాడు కరువయిపోయాడు. దానితో ఆవిడ కన్నులవెంట భాష్పదారాలు కారాయి. చాలా అవమానం పొందినదై తండ్రివంక చూసింది. తండ్రి ఈమెను జుగుప్సతో చూడరాని వ్యక్తిని చూసినట్లు అసలు పిలవని దానివి ఈ సభలోనికి ఎందుకు వచ్చావు అన్నట్లు చూశాడు. తల్లి ఆగ్రహం చెందింది. వెంటనే ఒకమాట అంది ‘ఏమయ్యా, పరమశివుడు నీకు పెద్దల్లుడు, లోకమంతటికీ పూజనీయుడు. మహానుభావుడు. మహాత్యాగి. ఒకరికి ఉపకారం చేయడమే తప్ప ఒకరి దగ్గర ఏదీ పుచ్చుకోవాలనే కోరిక లేనివాడు. జగత్తుకు తండ్రి. అటువంటి వాడి పట్ల నీవు నిరాదరణతో ప్రవర్తించి ఆయనను ఆహ్వానించకుండా నిరీశ్వర యాగమని, శివునికి హవిస్సు ఇవ్వనని, ఇవ్వకపోతే ఏమి చేయగలడని వెలి వేస్తున్నట్లుగా ప్రవర్తించావు. నీ పాపం ఊరికే పోతుంది అనుకుంటున్నావా? ‘శివ’ అన్న నామమును పైకి పలికినా మనసులో అనుకున్నా సమస్త జీవుల పాపములు పోతాయి. ఆయన పేరే అంత గొప్పది. అటువంటి ఆయనను నువ్వు ద్వేషిస్తున్నావు. ఎవడు శివుని ద్వేషిస్తున్నాడో వాడు మంగళమును ద్వేషించినట్లు. కాబట్టి నీకు అమంగళములు కలుగుతాయి తప్ప మంగళములు కలుగవు. నీకు పతనము తప్ప వేరొకటి లేదు. ఎటువంటి కోరిక ఉన్న వాడయినా ఆ పరమశివుని పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అతని కోరికలు తీరతాయి. ఎవరు వస్తే కోరికలు తీరతాయో వాడిని రావద్దన్నావు. అది నిరీశ్వర యాగమే కావచ్చు. కాబత్ట్ ఆ కోరిక కూడా నీకు తీరడానికి వీలులేదు. నీవు మరింత పాపము చేసిన వాడవు అయ్యావు. త్రిమూర్తులలో ఒకరైన పరమశివుని విస్మరించావు. పరమ పవిత్రమయిన శంకరుని పట్టుకుని అనరాని మాటలు అన్నావు. దీనికి శాస్త్రం ఒక్కటే చేయమని చెప్తోంది.
ఎవడు పరమశివుని నిరాధారంగా, నిష్కారణంగా, పక్షపాత బుద్ధితో దూషిస్తున్నాడో వాడి నాలుక కోసేయాలి. అలా కోయలేక పోతే వాడు వెంటనే కర్ణ రంధ్రములను మూసుకుని అక్కడినుండి దూరంగా వెళ్ళిపోవాలి. ఆ పాపమును పంచుకోకూడదు. జగత్తుకి తండ్రి అయిన శంకరుడిని నీవు నిందచేశావు. అటువంటి నింద చేసినవాడి కూతురన్న పేరు నాకీ శరీరం ఉన్నంతకాలం ఉంటింది. నేను ఎక్కడ కనపడినా నన్ను దాక్షాయణీ అంటారు. నీ సంబంధం గుర్తు వచ్చేటట్లుగా నన్ను దాక్షాయణీ అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ బాధను అనుభవించాలి. పరమ ద్రోహివి, పాపివి, శంకర ద్వేశివి, శివనింద చేసిన వాడివి అయిన నీ కడుపున పుట్టిన ఈ శరీరంతో ఉండడాన్ని నేనిక అంగీకరించను. కాబట్టి ఈ శరీరమును అగ్నిహోత్రములో వదిలిపెట్టేస్తాను’. అన్నిటికన్నా నా బాధ ఏమిటో తెలుసా? నా భర్త పరమజ్ఞాని. మహోదారుడు. ఇప్పుడు నీవు ఇంత అవమానం చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతే నా భర్త నన్ను ఏమీ అనడు. నా కంట కన్నీరు కారుతుందేమోనని నన్ను ఏమీ అడగడు. నన్ను ఓదార్చడానికి తన తొడమీద కూర్చోబెట్టుకుంటాడు. అలా కూర్చో బెట్టుకున్నప్పుడు పరిహాసం ఆడవలసి వచ్చి నన్ను పేరు పెట్టి పిలవవలసి వస్తుంది. ఆ సమయంలో ఆయన నన్ను దాక్షాయణీ అని దగ్గరకు తీసుకుంటే నీ పాపం నాకు అప్పుడు గుర్తుకు వస్తుంది. దక్షుడి కూతురు అనే శరీరంతో ఉండడం నాకిష్టం లేదు. ఆ ఒక్క కారణమునకు నేను చచ్చిపోతాను’ అన్నది.
యాగంలో ఉన్న వాళ్ళందరూ ఈ మాటలు విని అలా నిలబడిపోయారు. ఆవిడ వెంటనే అక్కడ పద్మాసనం వేసుకుని ప్రాణాపానవ్యానఉదానసమానమనే వాయువులను ఒకదానితో ఒకటి కలుపుతూ మూలాధారం దగ్గర నుంచి వాయువులను పైకి లేపి, భ్రూమధ్యం దగ్గరకు తీసుకు వచ్చి సహస్రారానికి తీసుకువెళ్ళే ముందు శరీరంలో యోగాగ్నిని పుట్టించి, భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రం మీద శంకరుని పాదపద్మములను ధ్యానిస్తూ ఆ పాదపద్మములనే చూస్తూ, అందరూ చూస్తుండగా ఒక్క క్షణంలో అగ్నిగోత్రంలో భస్మం అయిపోయింది.
No comments:
Post a Comment