Search This Blog

Sunday, 11 February 2018

SIVAMAHAPURANAM - PARVATI KALYANAM - PART V - 40


పార్వతీ కళ్యాణము – పార్ట్ 5



ఇప్పుడు మరల కదలిక రావాలంటే లోకములు రక్షింపబడాలంటే మరల మహానుభావుడయిన శంకరుడే పూనుకోవాలి. మళ్ళీ పార్వతీదేవి తనతో కలిసి ఉండడానికి మార్గమును తానే సుగమం చేయాలని శంకరుడు భావించాడు. మహానుభావుడు భక్తవశంకరుడు, లోకవశంకరుడు. ఇప్పుడు శంకరుడు తన పెద్ద కొప్పును తగ్గించేసి చివరన కొప్పులాంటి దానిని పక్కకి ముడివేశాడు. పైకి ఉండే జటాజూటం పక్కకి తిరిగింది. మూడవ నేత్రమున కనపడకుండా దాచేశాడు. పెద్ద కుంకుమ బొట్టును పెట్టుకున్నాడు. ఒంటికి రాసుకున్న విభూతినంతటినీ పక్కన పెట్టేశాడు. ఒళ్ళంతా పసుపు రాసేసుకున్నాడు. త్రిశూలమును తీసేసి దానికి బదులు చేతిలో సజ్జనొకదానిని పట్టుకున్నాడు. ఎప్పుడూ తన శరీరంలో వామార్ధభాగం పార్వతీ దేవికి ఇచ్చేశాడు కాబట్టి సగభాగం స్త్రీతో కూడుకున్న వాడయిన శంకరుడు ఈవేళ పూర్తిగా స్త్రీగా మారిపోయాడు. ‘నేను ఎరుక చెప్తాను-సోది చెప్తానుఅంటూ హిమవంతుడు పరిపాలిస్తున్న ప్రాంతమునకు వచ్చాడు. గౌరీదేవి ఈమెను అంతఃపురంలోంచి చూసింది. ‘ఎప్పటినుండో నాకు అయిదు శిరస్సులు ఉన్నవాడిని భర్తగా పొందాలని కోరిక. దగ్గరకి వస్తోంది అనుకున్న ముహూర్తం భగ్నమయిపోయింది. ఎక్కడ ఉన్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు అయిదు ముఖముల ఉన్నవాడిని భర్తగా ఎలా పొందుతానో, పొందడానికి మార్గమేదో నాకేమయినా చెప్తుందేమో అని లోపలికి తీసుకురండిఅని చెలికత్తెలకు చెప్పింది. శంకరుడే సోది చెప్పే ఆవిడరూపంలో అంతఃపురంలోకి వచ్చాడు. పార్వతీదేవి ఒక పీటవేసి ఎరుకల సానిని కూర్చోపెట్టింది
పర్వతరాజు ఇంట్లో నేను ఎన్నాళ్ళు ఇలా ఉండిపోవాలి? నేను ఇక్కడనుండి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకు వెడతాడు? కాముడిని కాల్చేసిన వాడు నా చిటికెన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు? నా ప్రశ్నలకు సమాధానములు కావాలి. వాటిని నీవు చెప్పవలసినదిఅని అడిగింది.
సోది చెప్పించుకుందుకు ఆవిడ పళ్ళెంలో ముత్యాలు పోసి పట్టుకు వెళ్ళింది. సోది చెప్పే ఆవిడ ముత్యాలను ఒకసారి చేతితో నలిపి వాటిని మూడు కుప్పల క్రింద పెట్టి తన ఎడమచేతితో పార్వతీదేవి చేతిని పట్టుకుంది. ఆమెకి సోది చెప్పేటప్పుడు ఎడమ చెయ్యి పట్టుకుని కుడిచేతిని ముత్యాలకుప్పకు తగిలించి తరువాత తలకి తగిలించాడు. ఇదిగిదిగో చెప్తున్నా వినుకోయమ్మారహస్యం చెప్తున్నాచెయ్యిచ్చి వినుకోయమ్మాపై అందాలకు వాడు లొంగడే తల్లినీకు తెలియనిదాయోగ పట్టం కట్టు అయ్యప్ప సామికి - నామాట నమ్మమ్మచెప్పింది చెయ్యమ్మచీరవద్దు, సారె వద్దు, తాంబూలం వద్దు, నీకు కావలసిందే నాకూ కావాలి. అందుకే వచ్చానే తల్లి. అన్నీ చెప్పానోయమ్మా మళ్ళీ వస్తానోయమ్మా అవసరమయితే అని చెప్పి వెళ్ళిపోయాడు.
సోది విని పార్వతీదేవి చాలా సంతోషపడిపోయింది. శంకరుడిని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదని గ్రహించింది. శంకరుడు సౌందర్యమునకు సౌందర్యము. ఆయనను వశం చేసుకోవాలంటే తాను కూడా తపస్సు చేయాలని అనుకుంది. హిమవంతుడి దగ్గరకు వెళ్ళినాన్నగారూ శంకరుని భర్తగా పొందాలనుకుంటున్నాను. నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెడతాను. మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసిందిఅని తండ్రి పాదములు పట్టి ప్రార్థన చేసింది. తండ్రి ఆమె మనసు ఎరిగిన వాడు. ‘అమ్మా, ఇది చాలా కష్టంతో కూడుకున్న విషయం. అయినా నీవు అడిగిన కోర్కె చాలా గొప్పది. కనుక నిన్ను అలాగే పంపుతాను. వెళ్ళిరాఅన్నాడు. పిమ్మట ఆమె తల్లి మేనక దగ్గరకు వెళ్లి ఆమె పాదములు పట్టి నమస్కరించి తపస్సు చేసుకుందుకు వెళ్ళడానికి అనుమతి కోరింది. ‘నేను నిన్ను అరణ్యములకు ఎలా పంపను? నీకు భర్తను వెతకవలసిన తల్లిదండ్రులం మేము ఉండగా నీవు తపస్సు చేయడానికి వెళ్ళడం ఏమిటి? ఒకవేళ శంకరుడు తపస్సు చేస్తే తప్ప రాడని అంటావేమో అటువంటప్పుడు ఇంట్లోనే శంకరుడిని గూర్చి పూజ చేసుకోఅని చెప్పింది. అపుడు పార్వతీదేవిఅమ్మా అలా అనకు మనశ్శాంతి కోసం దూరంగా ఉండి లోపలి అంతర్ముఖురాలనై శంకరుని పాదములు పట్టి పూజించి శంకరుడిని నావాడిగా చేసుకోవాలి. ఇది నా కోరిక. కనుక నేను తపోభూములకు బయలుదేరతానుఅని చెప్పింది. చివరకు మేనకాదేవి అంగీకరించింది. కొంతమంది చెలికత్తెలనిచ్చి తపస్సుకు పంపుతూ ఆఖరి నిముషంలో మేనకాదేవి పార్వతిని ఉమా అని పిలిచింది. ‘అంటే తపస్సునకుమాఅంటే వెళ్ళవద్దు. తపస్సునకు వెళ్ళవద్దు అని పిలిచింది కాబట్టి పార్వతీదేవికి లోకంలోఉమాఅనే పేరు వచ్చింది
ఇప్పుడు పార్వతీ దేవి తపస్సుకు బయలుదేరుతోంది. అందమయిన కబరీ బంధంతో పూలతో అలంకారం చేయబడే ముడికి ఆవిడ రుద్రాక్షలను చుట్టుకుంది. బాలచంద్రుడిలా ఉండే ఫాలస్థలం మీద మూడు విభూతిరేఖలను తీర్చుకుని బొట్టు పెట్టుకుంది. ఒంటినిండా అంగరాగములను రాసుకునే తల్లి పలుచగా ఒంటినిండా భస్మమును రాసుకుంది. పట్టుబట్టలు కట్టుకునే తల్లి ఒక కాషాయవస్త్రమును కట్టుకుంది. కమండలం పట్టుకుని తాపసియై బయలుదేరి వెళ్ళి అరణ్యములో కూర్చుని తపస్సు మొదలుపెట్టింది. పరమ ఘోరమయిన తపస్సు చేసింది. శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షధారల మధ్య నిలబడి తపస్సు చేసింది. కొంతకాలమునకు ఆహారం కూడా మానేసి కేవలం ఆకులను మాత్రమే తిన్నది. అంత అందమయిన పార్వతీ దేవి శుష్కించి పోయి సన్నగా దర్భలా అయిపొయింది. చివరకు ఆకులను కూడా తినడం మానివేసింది. అపర్ణ అయిపొయింది
ఆమె అలా తపస్సు చేస్తుంటే శంకరుడు కదిలిపోయాడు. తాను కదిలి వచ్చాడు. ఒంటిమీద ఉన్న పాములన్నీ తీసివేశాడు. జటాజూటమును తీసేశాడు. చంద్రరేఖను తీసేశాడు. పట్టుపుట్టం విప్పేశాడు. అన్నీ తీసివేసి బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. ఆవిడ మనస్సు ఎంతవరకు నిలబడుతుందో చూడాలనుకున్నాడు. యథార్థమునకు శివపార్వతుల ఇద్దరి మనస్సులూ ఒక్కటే. కానీ పార్వతీదేవి మనస్సు శంకరుడి మీద ఎంత గొప్పగా ఉంటుందో లోకమునకు చూపించాలనుకున్నాడు. బ్రహ్మచారి వచ్చినట్లుగా పార్వతీదేవి తపస్సు చేస్తున్న ప్రదేశమునకు బయలుదేరి వచ్చాడు. బ్రహ్మచారి రూపంలో వచ్చిన శంకరుని అందమును చూసి జగత్తు మోహించింది.
అక్కడకు వచ్చి పార్వతీదేవి వంక చూసి ఏమీ తెలియని వాడిలాఈమె తల్లిదండ్రులు ఎవరు? అరణ్యంలో కూర్చుని పెళ్ళికావలసిన పిల్ల తపస్సు చేయడం ఏమిటి? ఎవరిని భర్తగా పొందాలనుకుంటోంది? ఎందుకింత గొప్ప తపస్సు చేస్తోంది? ఈవిడ కథ ఏమిటో తనకు చెప్పవలసినదిఅని ఆమె చుట్టూ ఉండే చెలికత్తెలను అడిగాడు. అపుడు చెలికత్తెలుఈమె హిమవంతుని కుమార్తె గౌరి. మూడుకన్నులు ఉన్న పరమశివుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేస్తోందిఅని చెప్పారు. ఇపుడు బ్రహ్మచారినీవు హిమవంతుని కూతురివి, గొప్ప అందమయిన దానివి, మేనకాదేవి కూతురువి. పార్వతీ దేవివి. ఎక్కడో ఉన్న జంగమదేవర గురించి తపస్సు ఏమిటమ్మా? నేను ఎందరినో కన్యలను చూశాను. సిద్ధ గంధర్వ గరుడ కిన్నెర కింపురుషాది గణముల కుమార్తెలను చూశాను. నీకు ఉన్న అందం వాళ్ళు ఎవరికీ లేదు. తెలియక శివుడంటే అందంగా ఉంటాడు అనుకుంటున్నావు. ఆడదయినా లోకంలో అన్నం పెట్టేవాడు కావాలని కోరుకుంటుంది. ఆయన బ్రహ్మకపాలం పుచ్చుకుని ఇంటింటి ముందూ నిలబడిభవతి భిక్షాందేహిఅంటూ ఉంటాడు. ఈయన నీకు భర్తగా దొరికాడా? అతని వయసే తెలియదు, ఆకారమే లేదు. కులగోత్రములు తెలియవు. తల్లి తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. ఏదో మాయయో, మంత్రమో ప్రయోగించి నిన్ను పెళ్ళి చేసుకుందామని నీచేత తపస్సు చేయించేస్తున్నాడు. నిజంగా శంకరుడు ప్రత్యక్షమై నిన్ను పెళ్ళి చేసుకుంటే నీవు ఎందుకూ పనికిరాకుండా అయిపోతావు. ఆయన బుద్ధి నీకు తెలియదు. ఒకళ్లిస్తే పుచ్చుకోడు. ఆయనకు ఉన్నవే వాడుకుంటాడు. ఆయనకున్నవి పుర్రెలమాల, ఏనుగు చర్మం, పాములు కంకణములుగా, సుగంధ లేపనములకు బదులు బూడిద, కాపురానికి రుద్రభూమి నివాసం, పుష్పమాలలకు బదులు చంద్రబింబం, ప్రయాణమునాకు ముసలి ఎద్దు, ఎవరికయినా చెప్పుకుంటే కూడా సిగ్గు. వెర్రితనం కాకపోతే శివుడిని పెళ్ళిచేసుకోవడం ఏమిటి? తపస్సు మంచిది కాదు ఆపవలసింది. నేను బ్రహ్మచారిని. నిన్ను పెళ్ళి చేసుకోవడానికి యోగ్యుడను. నాతో రావలసినదిఅని చెప్పాడు. అమ్మవారి వైభవమును ప్రకాశింపజేయడానికి, తన పెళ్ళి తాను పాడుచేసుకోవడానికి శంకరుడిలా చెప్పుకునే వాడు ఎక్కడా ఉండడు
బ్రహ్మచారి మాటలను విని పార్వతీదేవిశంకరుడి గురించి వీడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వెంటనే వీడిని మెడబట్టి తోసి అవతల పారేయండిఅని చెలికత్తెలకు చెప్పింది. గబగబా చెలికత్తెలందరూ తోసెయ్యడానికి సిద్ధపడుతున్నారు. అపుడు బ్రహ్మచారి రూపంలో ఉన్న శంకరుడు వాళ్ళకి దొరకకుండా అటూ ఇటూ పరుగెడుతూనన్ను నారాయణుడు, చతుర్ముఖ బ్రహ్మ కూడా పట్టుకోలేరు. నాకు తగిన పిల్ల పిల్లే. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను. ఇప్పుడే ఇక్కడే పీతల మీద కూర్చుని ఈమె మెడలో తాళి కట్టేసి ఈమెను నాదానిని చేసేసుకుంటానుఅన్నాడు. అపుడు పార్వతీదేవి వీడెవడో ఇంత దూర్తంగా ఉన్నాడు అనుకుని గభాలున పైకిలేచివీడిని మామూలుగా విడిచి పెట్టవద్దు. కర్రలు పట్టుకు వచ్చి వీడి పళ్ళు ఊడి పోయేటట్లు కొట్టి త్రోసి అవతల పారేయండిఅని చెప్పింది. వెంటనే చెలికత్తెలు పెద్ద పెద్ద కర్రలు పట్టుకువచ్చి ఆయన మీదకు విసరడం ప్రారంభించారు. అపుడు శంకరుడు ఒక్కసారిగా ఏనుగు చర్మం కట్టుకున్న వాడయి, జటాజూటంతో చంద్రరేఖతో, మూడవకంటితో మెడలో వేసుకున్న నాగాభరణములతో రుద్రాక్ష మాలలతో దివ్యమయిన సుగంధముతో జటాజూటమునందు గంగతో వృషభవాహనం పక్కన నిలబడిన వాడయి పార్వతీదేవికి ప్రత్యక్షం అయ్యాడు. అపుడు పార్వతీదేవి పొంగిపోయి ఆయన పాదముల మీద పడి నమస్కరించింది. అమ్మవారు తన తపస్సు ఫలించింది అనుకుంది.

No comments:

Post a Comment