Search This Blog

Monday 16 April 2018

PARASURAMAVATARAM


PARASURAMAVATARAM



క్షత్రియుల  ప్రాబల్యం  పేరిగి  బ్రాహ్మణోత్తము ల పై  అత్యాచారాలు  హేచ్చూమీరిన  తరుణం లో  సాక్షాత్తు  శ్రీ  హరి  బ్రాహ్మణుడి  గా  అవతరించి సహస్ర బాహువులు  కల్గిన  కార్టవీర్యార్జునడిని  వధించాడు 

ఎంతటి ఉన్నతులైనప్పటికీ, అరిషడ్వర్గాలకు లోనైతే, పతనాన్ని పొందకతప్పదని నిరూపించే కథలు మన పురాణేతిహాసాల్లో చాలానే కనపడతాయి. ఒక్కోసారి ఆ పరమాత్మే స్వయంగా అవతారమెత్తి వారిని సంహరించాల్సిన అవసరం కలుగుతూ ఉంటుంది. బలిచక్రవర్తి, రావణాసురుడు, కార్తవీర్యార్జునుడు వంటివారు ఈ కోవలోనికి చెందిన వారే. శివభక్తి పరాయణుడు, వేదవిద్యా పారంగతుడు అయిన రావణాసురుడు రావణ బ్రహ్మ అని పిలిపించుకుని కూడా తనలో ఉన్న పరస్త్రీ వ్యామోహమనే ఒక బలహీనత వల్ల, గర్వం వల్ల విష్ణ్వావతారమైన రాముని చేతిలో సంహరింపబడ్డాడు. అలాగే బలిచక్రవర్తి కూడా మహా పరాక్రమవంతుడైనప్పటికీ గర్వం అనే దుర్గుణం వల్ల విష్ణుమూర్తి అవతారమైన వామనుని వల్ల పాతాళలోకానికి పంపివేయబడ్డాడు.

నలుడు, సగరుడు, పురూరువుడు, పురకుత్సుడు, హరిశ్చంద్రుడుల సరసన షట్చక్రవర్తులలో ఒకరిగా చేర్చబడిన కార్తవీర్యార్జునుడు కూడా మహాపరాక్రమవంతుడు. హైహయ వంశజుడు, కృతవీర్యుని కుమారుడు అయిన కార్తవీర్యుడు పుట్టుకతో చేతులు లేకుండా జన్మించాడు. దత్తాత్రేయుని పరమభక్తితో సేవించి ఆయననుండి నాలుగు వరములు పొందాడు. మొదటి వరముగా వేయిచేతులు, రెండవ వరముగా తాను అధర్మమున కాలు పెట్టినచో సత్పురుషులు తనను నివారించవలెననియు, మూడవ వరముగా ధర్మయుద్ధమున భూమండలమునంతటినీ జయించి ధర్మయుక్తముగా పాలించవలెననియు, నాలుగవ వరముగా అందరికన్నా మిన్న అయిన వీరునితో యుద్ధము చేయుచుండగా మరణించవలెననియు కోరుకొనెను. దత్తాత్రేయుడు ఆ వరములను అనుగ్రహించెను. అది మొదలు తనకున్న బలపరాక్రమములతో, వేయిచేతులతో ఈ భూమండలాన్నంతటినీ జయించి, మాహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించుచుండెను. పదివేల యజ్ఞాలు చేసి, బ్రాహ్మణులకు భూరిదక్షిణలిచ్చెను. నలభైవేల సంవత్సరాలు ధర్మయుక్తముగా పరిపాలించెను. మానవులే కాక యక్ష, కిన్నెర,కింపురుష, గంధర్వాదులు కూడా కార్తవీర్యుని పరిపాలనను మెచ్చుకుంటూండేవారు. అది గమనించిన కార్త్యవీర్యార్జునిలో గర్వము ప్రవేశించింది. తనను మించినవాడు లేడనే అహంభావముతో ప్రవర్తిస్తూ ఉండేవాడు.

ఒకసారి అగ్నిదేవుడు కార్తవీర్యార్జునుని వద్దకు వచ్చి, తన ఆకలి తీర్చుకోవడానికి అతని సామ్రాజ్యములో సంచరించడానికి అనుమతి అడిగెను. అగ్నిదేవుడు అంతటివాడు తనని అడిగాడు కదా అనే అతిశయముతో అనుమతినిచ్చి, ఎవరూ అగ్నిని నిరోధించకుండా చూస్తున్నాడు. అగ్నిదేవుడు, అతని రాజ్యంలోని చెట్లు, చేమలు, అడవులు అన్నీ ఆహుతి చేసుకుంటూ ముందుకుసాగుతూ వశిష్టముని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్టముని ఆగ్రహంతో అగ్నికి అనుమతినిచ్చిన కార్తవీర్యుని “మునికుమారుడి చేతిలో హతమగుదువు గాక” అని శాపమిచ్చాడు. గర్వంతో ఉన్న కార్తవీర్యుడు ఆ మాటలను లక్ష్యపెట్టలేదు.

ఒకసారి కార్తవీర్యుడు తన భార్యలతో కూడి నర్మదానదిలో క్రీడించుచూ తన సహస్రబాహువులను అడ్డుపెట్టి నర్మదాప్రవాహాన్ని నిలువరించి, దారి మళ్ళించెను. ఆ నదీప్రవాహం అక్కడికి దగ్గరలోనే విడిది చేసివున్న లంకేశుడైన రావణుని శిబిరాలను ముంచివేసింది. రావణుడు కోపోద్రిక్తుడై, కార్తవీర్యునిపైకి యుద్ధానికి రాగా, కార్తవీర్యుడు రావణుని పట్టి బంధించి, అతనిని తన రాజ్యానికి కొనిపోయెను. పులస్త్యమహర్షి వచ్చి విడువమనగా అతని మాట మన్నించి రావణుని విడిచిపెట్టెను.

ఒకసారి కార్తవీర్యుడు వేటకి వెళ్లి, అలిసిపోయి, జమదగ్ని ఆశ్రమ సమీపంలో విడిదిచేసెను. జమదగ్ని రాజునూ, అతని పరివారాన్ని ఆదరించి, అందరికీ అతిధి సత్కారాలు చేసెను. ఇది అంతా జమదగ్నిమహర్షి వద్ద ఉన్న కామధేనువు వల్ల సాధ్యమయ్యిందని తెలుసుకున్న కార్తవీర్యుడు ఆ కామధేనువుని కోరుకొనెను. జమదగ్ని అది తన జీవనహేతువని, దానిని విడిచి తను యజ్ఞయాగాదిక్రతువులు నిర్వహించలేనని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా కామదేనువును అక్కడినుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో యాత్రలకని వెళ్ళిన జమదగ్ని మహర్షి పుత్రుడూ, విష్ణ్వంశ అయిన పరశురాముడు అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకుని, కార్తవీర్యునిపై యుద్ధానికి వెళ్ళాడు. కార్తవీర్యుని సైన్యాన్నంతటినీ నాశనం చేసి, తుదకు కార్తవీర్యుని కూడా సంహరించాడు. సాక్షాత్ విష్ణువు చేతిలోనే హతమైన కార్తవీర్యుడు ఉత్తమగతులు పొందాడు. తన తండ్రిని చంపిన కార్తవీర్యుని పుత్రులనే కాక, అధికారగర్వంతో మిడిసిపడుతున్న క్షత్రియులందరినీ ఇరవై ఒక్క మార్లు భూప్రదక్షిణం చేసి సంహరించాడు పరశురాముడు.

షట్చక్రవర్తులలో ఒకడైనప్పటికీ, దత్తాత్రేయ వరప్రసాది ఐనప్పటికీ, రావణుడినే బంధించగల పరాక్రమవంతుడైనప్పటికీ, నాగరాజు అయిన కర్కోటకుడిని పట్టి తన రాజ్యమందు నిలుపుకోగలిగిన ధీశాలి అయినప్పటికీ, సముద్రమే సరిహద్దులుగా కలిగిన సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తి ఐనప్పటికీ, సహస్ర బాహువులతో దానం చేయగల సమర్థుడైనప్పటికీ, కేవలం
గర్వం, అహంకారం అనే లక్షణాల వల్ల, వినయం, వివేకం నశించి, గోబ్రాహ్మణ అవమానాలు చేయడమే అతని పతనానికి హేతువయ్యింది. తనకున్న బలపరాక్రమాలను, శక్తియుక్తులను, విజ్ఞానాన్ని, వినయశీలసంపన్నతతో ఆ పరతత్త్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించలేకపోవడమే అతనికి సమస్య అయింది. కార్తవీర్యుని కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి అదే. మనకున్న శక్తిసామర్థ్యాలను పరుల హితం కోసం ఉపయోగిస్తూ, గురువులు, బ్రాహ్మణులు, గోవులు, దైవం పట్ల భక్తి, గౌరవం కలిగి వారి యందు వినయంతో నడుచుకుంటూ ఆ పరమాత్మతత్త్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించడమే మన లక్ష్యం కావాలి.

No comments:

Post a Comment