ధర్మాన్ని ఎందుకని ఆచరించాలి ?
వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే,
వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షా ద్రామాయణాత్మనా.
వేదవేద్యే-వేదంచేత తెలిసికోదగినవాడెవడూ? పరేపుంసి-పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు. వేదవేద్యుడైన నారాయణుడు దశరథాత్మజుడైన వెంటనే వేదాలు వాల్మీకి శిశువుగా, రామాయణంగా అవతరించినవి. ఆ రామాయణం ఏమి చెపుతూంది? వేదాలు ధర్మమును చెపుతై. ఆలాటి ధర్మస్వరూపుడే రాముడు అని రాముని తల్లి కౌసల్య, అడవులకు పోయే రామచంద్రుడితో చెప్పిన మాటలవల్ల రాముడు 'ధర్మస్వరూపుడు'. అని గోచరిస్తుంది.
పొరుగూరు పోయే బిడ్డకు తల్లి తినుబండారాలు కట్టి యివ్వడం వాడుక. రామునికి కౌసల్య యిచ్చిన తినుబండం ఏమిటి? ఆమె ఇచ్చిన ఆశీర్వాదమే.
'యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ
స వై రాఘవశార్దూల ధర్మస్త్వా మభిరక్షతు'
రాఘవా! నీవు ఏ ధర్మాన్ని ధైర్యంతో నియమంతో ఆచరిస్తావో, ఆ ధర్మమే నిన్ను కాపాడేది'
ధృతి అంటే ధైర్యం. ఒకడు పరిహసిస్తాడని లెక్కచేయక ఎవరేమన్నా ధైర్యంతో ఉండడమే ధృతి. 'ఎవరేమన్నా సరే' అని కొందరు కొన్నాళ్ళు ధైర్యంతో ఉంటారు. పిదప పిదప మెల మెలగా దాన్ని వదిలివేస్తారు. దానికి ఒక కట్టుబాటో నియమమో ఉండదు. దానివల్ల ప్రయోజనం శూన్యం.
రాఘవుడు ధర్మాన్ని కట్టుబాటుతో నియమంతో ఒక పూటయినా వదలక కాపాడుకొంటూ వచ్చాడు. మనశ్చలనం లేక ధర్మం పాటిస్తూవచ్చాడు. ఎవరు నవ్వేది, మరి ఎవరడ్డు పెట్టేది మన ధర్మాన్ని మనం ఇందువల్ల వదలరాదు. ఆ ధర్మస్వరూపి ధర్మరక్షణ చేశాడు. అందుచేతనే అడవికి పోతూవున్నపుడు కౌసల్య కుమారుడికి 'ధర్మంగా వర్తించుకో' అని మాత్రమే చెప్పక, ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో కాపాడుకుంటూ వచ్చావో, ఆధర్మమే నిన్ను కాపాడుతుందని ఆ ఆపదల నన్నిటినీ నివృత్తి చేసే ఆశీర్వాదం చేస్తూంది.
ఒక కుక్క దొంగలబారినుండి మనలను కాపాడవలెనంటే దానిని మనం చక్కగా కాపాడాలి. మనం దేనిని కాపాడతామో అది మనలను కాపాడుతుంది- ''నీవు ధర్మాన్ని రక్షించుకొంటూ వచ్చావు, ఇకముందు గూడా రక్షించుకొంటూ వస్తావు. అదే. ఆధర్మమే నిన్ను రక్షించుకొంటుంది' అని ఇతరులు చెప్పటం అటుంచి సొంత తల్లి 'తన బిడ్డ అడవులపాలయిపోతున్నాడే' అని దుఃఖించక ఇట్లా చెబుతూంది. కూడా పుట్టిన సోదరుడే 'అన్నా! ధర్మం. ధర్మం' అంటూ ధర్మానికి కట్టుబడి ఉండడముచేతనే నీకు ఇంత శ్రమ ఇంత కష్టమూ సంభివిస్తూంది. దాన్ని వదలివేశావా నీకీబాధ ఉండదు' అని ఎన్నోసారులు చెప్పాడు. 'ఎవరు నవ్వినా, నాయనా! రాఘవా! ఏధర్మాన్ని నీవుధైర్యంతో నియమంతో వదలక అనుష్ఠిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది.' అని తల్లి ఆశీర్వదిస్తున్నది.
'ధర్మం తలకాస్తుంది' అని ఒకసామెత ఉంది. ఆడవిలో రాఘవుని తల కాచింది ధర్మమే. రావణునికి పది తలలున్నప్పటికి తాను చేసిన ఆధర్మం ఒక తలనయినా కాచలేక పోయింది.
'వేదోఽఖిలో ధర్మమూలమ్' వేదమే ధర్మమును చెపుతూంది. వేదాలలో వర్ణింపబడిన పరమపురుషుడు దశరథునకు కొడుకుగా అవతరించా డనీ, 'వేదవేద్యే పరే పుంసి' అనే శ్లోకం చెపుతూంది. కౌసల్యాదేవి వాక్యంవల్ల 'ధర్మ స్వరూపుడే రాముడు' అని తెలియవస్తూంది. ఇంకో చోట 'రామో విగ్రహవాన్ ధర్మః' అని ఉన్నది. ధర్మం అనేది మనోభావం. అది ఒక రూపం ధరిస్తే ఎలావుంటుంది అని అంటే రాముడై కూచుంటుంది అని అర్థం. ఆపత్కాలంలో కూడా ఒక అడుగయినా వెనుకాడకుండా ధైర్యంతో నియమంతో ఉండే రూపమే ధర్మం. ఆ ధర్మ స్వరూపమే రామావతారం. వేదాలవలన తెలియదగిన వస్తువే అందరకూ కంటికి కనబడే వస్తువుగా అవతరించింది. అపుడే వేదం సైతం రామాయణంగా అవతరించింది.
సాక్షాద్రామ చంద్రమూర్తినే లక్ష్యంగా పెట్టుకొన్న రామమంత్ర జపపరాయణులకు కామం, మోహం మొదలయిన మకిల యేదీ మనస్సు కంటదు. అట్టివారు ధర్మమార్గం వదలిపోరు.
'వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షాద్రామాయణాత్మవా'
వేదాలవల్ల తెలుసుకోదగిన పరమపురుషుడు దశరథునికి కొడుకుగా అవతరించినందున రామాయణరూపం ఎత్తిన వేదాలయొక్క సారం రామనామంలో ఇమిడి ఉంది. ఆ రామనామం చిత్తమాలిన్యం పోగొట్టి వేరొకదానిమీద ఆశ కలుగనీయక సదా ఆనందంగా ఉండేటటుల చేస్తుంది.
No comments:
Post a Comment