Search This Blog

Monday, 3 September 2018

అళగర్‌ కోవిల్‌ - ALAGHAR PERUMAL KOIL


అళగర్‌ కోవిల్‌



*దక్షిణ తిరుపతి గురించి విన్నారా!*

మధురైకి వెళ్లినవారు అక్కడి మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని, ఆ రూపాన్ని మదిలో నింపుకొని తిరుగుముఖం పడతారు. కొద్దిమంది భక్తులు మాత్రం అక్కడికి కాస్త దగ్గరలో ఉన్న అళగర్‌ కోవిల్‌ ఆలయాన్ని చూడకుండా వెనుతిరగరు. అళగర్‌ కోవిల్ అంటే మాటలా! రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది.

మధురైకి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ, ఓ కొండ పక్కన ఉన్న ఆలయమే అళగర్‌ కోవిల్‌. ఇందులోని మూలమూర్తి పేరు తిరుమాళ్. ఆయన చాలా అందంగా ఉంటాడు. కాబట్టి అళగర్‌ (అందమైనవాడు) అన్న పేరుతో పిలుస్తారు. తమిళ సాహిత్యంలో అడుగడుగా ఈ ఆలయం ప్రత్యేకత కనిపిస్తుంది. తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పదికారంలో సైతం ఈ ఆలయ వర్ణన వినిపిస్తుంది. ఇక ఆళ్వారులు కూడా ఈ స్వామిని పొగుడుతూ వందకు పైనే పాశరాలు రాసినట్లు తెలుస్తోంది. వైష్ణవ దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలలలో ఈ క్షేత్రమూ ఒకటి. ఇక్కడి స్వామి రూపం చేతనో, అడుగడుగునా అలరించే ప్రకృతి కారణంగానో.... ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతిగా భావిస్తుంటారు.
అళగర్‌ కోవిల్‌ వెనుక చరిత్ర ఏమిటన్న విషయం మీద పెద్దగా స్పష్టత లేదు. కానీ మధురలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామిని సోదరునిగా భావిస్తారు. మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో, ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం తరలివెళ్తుంది. ఈ అళగర్‌ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. మహాభారతకాలంలో ధర్మరాజు, అర్జునులు సైతం ఈయనని దర్శించారని అంటారు. ఇక దక్షిణాది రాజుల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు అందరూ ఈ స్వామిని సేవించినవారే.
అళగర్‌ స్వామి మహత్తును నిరూపించేందుకు అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పాండ్యరాజులలో రెండవవాడైన మలయధ్వజ పాండ్యరాజుకి ఈ స్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లు చెబుతారు. రామానుజాచార్యుడి ముఖ్యశిష్యుడైన కరుదాళ్వార్‌కు ఈ స్వామి మహిమతోనే కంటిచూపు తిరిగి వచ్చిందట. ఈ ఆలయం పక్కనే కనిపించే కొండ సాక్షాత్తు ఆ నందీశ్వరుని అవతారం అని భక్తుల నమ్మకం.

అళగర్‌ కోవిల్ దగ్గరకి చేరుకోగానే మనం వేరే ప్రపంచానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయం నమ్ముకుని వందల ఏళ్లుగా జీవిస్తున్న గ్రామవాసులు కనిపిస్తారు. ఆలయం చుట్టూ శిధిలమైన కోటగోడలు, దీని రాచరికాన్ని గుర్తుచేస్తాయి. 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు వైభవాన్ని గుర్తుచేస్తాయి. సుందరపాండ్యన్‌ అనే రాజు 13వ శతాబ్దంలో విమానం గోపురం మీద పోయించిన బంగారపు పోత సూర్యకాంతికి మెరిసిపోతుంటుంది.

అళగర్‌ కోవిల్‌ ఆలయం వెలుపల ఉండే కరుప్పుస్వామి సన్నిధి గురించి కూడా చెప్పుకొని తీరాల్సిందే! అళగర్‌ కోవిల్‌లోని ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. ఈ విగ్రహాన్ని దొంగిలించేందుకు ఓసారి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారట. అలాంటి దాడికి సిద్ధంగా ఉన్న ఆలయ పూజారులు ప్రతిదాడి చేశారు. ఆ పోరులో 18 మంది దొంగలూ మట్టికరిచారు. ఆ సమయంలో వారికి ‘కరుప్పుస్వామి’ అనే కావలి దేవత కనిపించి, ఇక మీదట తాను ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తుంటానని మాట ఇచ్చాడట.

అళగర్‌ కోవిల్‌ వెలుపల ఉన్న కరుప్పుస్వామి సన్నిధి చాలా శక్తిమంతమైనదని చెబుతారు. సామాన్య భక్తులు ఈ స్వామి ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరని అంటారు. అందుకే ఏడాదిలో ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తీస్తారు. విచిత్రంగా అలా తలుపులు తీసే సమయంలో పక్షులు, కీటకాలతో సహా చుట్టూ ఉండే అడవులన్నీ ప్రశాంతంగా మారిపోతాయట. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కపోతుందని చెబుతారు.

అళగిరి కోవిల్‌లో తిరుమాళ్‌ స్వామివారితో పాటుగా వారి సతీమణ ‘సుందరవల్లి తాయార్‌’ ఆలయం కూడా చూడవచ్చు. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ఈమెకు ‘కళ్యాణవల్లి తాయార్‌’ అన్న పేరు కూడా ఉంది. వీటితో పాటుగా నరసింహస్వామి, చక్రత్తాళ్వార్, వినాయకు, ఆండాళ్ దేవతల విగ్రహాలూ దర్శనమిస్తాయి. ఇక ఆలయంలో రథమండపం, కళ్యాణ మండపం, వసంత మండపం, అలంకార మండపం... ఇలా అనేక కట్టడాలు అద్భుతమైన శిల్పాలతో ఆకట్టుకుంటాయి.

అళగిరి ఆలయం సమీపంలోనే నూపుర గంగ అనే తీర్థం ఉంది. విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తినప్పుడు, స్వయంగా ఆ బ్రహ్మదేవుడే ఆయనకు పాదపూజ చేశాడట. ఆ సమయంలో ఆయన పాదాల మీద ఉన్న ఆభరణాలని (నూపురం) తాకిన కొంత నీరు ఇక్కడ పడిందనీ.... అదే ఈనాటి నూపుర గంగ అనీ చెబుతారు. ఆ గంగలోని నీరు తాగితే సర్వరోగాలు హరించిపోతాయని భావిస్తారు.

అళగిరి కోవిల్‌ను దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలోనే ఉన్న ‘పళమూడిర్చోళై’ అనే ఆలయానికి తప్పక వెళ్తారు. కుమారస్వామికి ఉన్న ఆరు ప్రముఖ ఆలయాలలో ఈ ‘పళమూడిర్చోళై’ ఒకటి. ఇక్కడ వల్లీదేవసేన సమేతంగా ఉన్న కుమారస్వామిని దర్శించుకుని తిరిగి మధురైకు చేరుకుంటారు.

No comments:

Post a Comment