పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.
దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.
ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.
ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి, వివిధ ధాతువులుగా రూపొందెను.
ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.
గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి.
పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.
స్కందోత్పత్తి
1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా!
సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!!
2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్!
ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!!
3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా!
తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!!
4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా!
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!!
5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః!
సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!!
6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు!
తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!!
7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః!
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!!
8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్!
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!!
9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన!
ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!!
౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్!
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!!
౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన!
శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!!
12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః!
గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్!!
౧౩. తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్!
దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత!!
౧౪. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః!
సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన!!
౧౫. తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం!
అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం!
దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా!!
౧౬. అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః!
ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్!!
౧౭. శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం!
ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హాయ్ తదానఘ!!
౧౮. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం!!
౧౯. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం!
తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత!!
౨౦. మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ!
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత!!
౨౧. నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం!
సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్!!
౨౨. జాత రూపమితి ఖ్యాతం తదాప్రభ్రుతి రాఘవ!
సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం!
తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం!!
౨౩. త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః!
క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్!!
౨౪. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం!
దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః!!
౨౫. తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్!
పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః!!
౨౬. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే!
స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్!!
౨౭. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్!
కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్!!
౨౮. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్!
షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః!!
౨౯. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా!
అజయత్ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః!!
౩౦. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం!
అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః!!
31. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా!
కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ!!
౩౨. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః!
ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్!!
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః!!
*** గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు. ***
No comments:
Post a Comment