ద్వాదశ జ్యోతిర్లింగాలు
****************************** ***
శైవులు శివున్ని మూర్తి రూపములో మరియు లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం.
అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది.
నీ పుట్టుకే నీకు తెలియనివాడివి, నా పుట్టుకకు నీవు కారకుడివా..!? కానేకావు. నాకు నేను స్వయంగా అవతరించాను. నాపై నీ ఆధిపత్యం చెల్లదు. నేనే నీక న్నా అత్యధికుడిని అంటూ బ్రహ్మ వాదులాడసాగాడు. విష్ణువు ఎన్నివిధాల నచ్చజెప్ప ప్రయత్నించినప్పటికీ... బ్రహ్మ వినకుండా నేనే అధినాథుడను... ఈ విశ్వానికి నేనే అధినాథుడను అంటూ పెడబొబ్బలు పెట్టసాగాడు.
ఆ సమయంలో ఒక్కసారిగా ఫెళఫెళమంటూ విశ్వమం తా కంపించిపోయింది. ఆ ఆర్భాటాలకి హేతువేమిటో తెలియక బ్రహ్మ విష్ణువులు విస్మయం చెందుతూ అటూ ఇటూ చూడసాగారు.
లింగోద్భవం:
****************
ఆ సమయంలో ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుండగా,జ్వాలా స్తంభం ఒకటి బ్రహ్మ,విష్ణువు మధ్య ఆవిర్భవించింది.
సహస్రాధిక యోజనాల పొడ వుగా ఉద్భవించింది ఆ స్తంభం. అగ్నిజ్వాలలు విరజి మ్ముతున్న ఆ జ్యోతిర్లింగం ఆది మూలమెక్కడో, తుది యేదో... ఎక్కడున్నదో కూడా వారికి అర్థం కాలేదు.
ఆ జ్వాలా స్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకోగలిగిన వాడే తమలో అధికుడని వారిరువురూ నిశ్చయించుకున్నారు.
ఆ నిర్ణయానుసారం బ్రహ్మ హంసరూడుడై జ్యోతిర్లంగం తుది భాగాన్ని కనుక్కోవడానికి పైకెగిరి వెళ్లాడు. విష్ణువు ఆ లింగం అడుగు భాగాన్ని కనుక్కోవడానికి యజ్ఞ వరాహరూపం ధరించి లింగం ప్రక్క నుంచి భూమిని తొలుచుకుంటూ అడుగు భాగానికి ప్రయాణం ఆరంభించాడు.
కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఆ జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని కను క్కోవడం తనకు సాధ్యం కాదని గ్రహించి విష్ణువు వెనుదిరిగి యథాస్థానానికి వచ్చి బ్రహ్మకోసం నిరీక్షించసాగాడు.
బ్రహ్మ పైకి ఎన్ని యోజనాలు ప్రయాణించినా ఆ లింగం తుది భాగాన్ని కనుక్కోలేక నిరాశ చెందాడు.
ఆ సమయంలో విష్ణువు దేవాదిదేవా..! ఆద్యంతాలు లేని ఈ జ్వాలా లింగాన్ని అభిషేకించడం, అర్చించడం మాకు సాధ్యం కాదు. కావున, నీవు ఈ జ్వాలా స్వరూపాన్ని ఉపసంహరించుకొని, మా పూజలందుకోవడానికి అర్హమైన రూపంతో అవ తరించు అని ప్రార్థించాడు. విష్ణువు ఆ ప్రార్థనతో శాంతించిన పరబ్రహ్మ తన జ్వాలా స్తంభరూపాన్ని ఉపసంహరించుకున్నాడు.
మరుక్షణమే ఆ ప్రదేశం లో మొట్టమొదటి శివలింగం అవతరించింది. లింగోద్భవం జరిగిన ఆ సమయమే ‘మహాశివరాత్రి’ పర్వదినం అయింది.
లింగరూపంలో అవతరించిన పరమేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి..శివనామస్మరణతో పంచాక్షరీ మహామంత్రంతో అర్చించారు బ్ర హ్మ, విష్ణువులు. వారి భక్తి ప్రపత్తులకు సంతోషిం చి ఆదిదేవుడు ఆ లింగాకార మధ్యభాగంలో ప్రత్యక్ష మై దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించి అనుగ్రహించాడు.
లింగమనగా... ‘లీయతేగమ్యతే ఇతి లింగః’...
‘లిం’ లీయతి, ‘గం’ గమయతి...
అనగా ఈ జగత్తు దేనియందు సంచరించి, దేనియందు
లయం చెందుతుందో అదే ‘లింగము’ అని అర్థం.
ఆద్యంతాలు లేనిదే లింగము. లింగతత్త్వమే ఆత్మ. కనుక ప్రతి దేహంలో ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు.
అగమ్యము, అగోచరమైన దివ్య తత్త్వమును మానవులు గ్రహిచటానికి నిదర్శనముగా లింగము ఉద్భవించుచున్నది. లింగము అనంత నిరాకార పరబ్రహ్మమునకు చిహ్నం. ఈ సత్యాన్ని చాటడానికి ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉద్భవించి బ్రహ్మ, విష్ణువులకు దర్శనమిచ్చాడు. అనంతరం లింగాకారుడై ముల్లోకాలలోనూ వెలసి నిత్యాభిషేక అర్చనలు అందుకుంటున్నాడు.
భక్తులు, సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివశించే శివుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ తనని పూజించడానికి వీలుగా కోటానుకోట్ల శివలింగాలై వెలసి ఉన్నాడు.
ఇట్టి అనేకానేక శివలింగాలలో దాదాపుగా అన్ని ప్రతిష్ఠించినవి కాగా... కొన్ని మాత్రమే ఆ శివుడు తనకుతానుగా స్వయంగా లింగరూపుడై వెలిసినవి. వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవే ద్వాదశ జ్యోతిర్లింగాలు.
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర ‘లింగపురాణం’లో వ్యాసమహర్షి వివరించాడు.
ద్వాదశ జ్యోతిర్లింగ సంపూర్ణ స్తోత్రమ్
******************************
సౌరాష్ట్రదేశే విశదేஉతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే || 1 ||
శ్రీశైలశృంగే విబుధాతిసంగే తులాద్రితు0గేஉపి ముదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ||2 ||
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ || 3 ||
కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతమ్ ఓంకారమీశం శివమేకమీడే || 4 ||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి || 5 ||
యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి || 6 ||
సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి || 7 ||
యామ్యే సదంగే నగరేஉతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే || 8 ||
సానందమానందవనే వసంతమ్ ఆనందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || 9 ||
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకమాశునాశం ప్రయాతి తం త్ర్యమ్బకమీశమీడే || 10 ||
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే || 11 ||
ఇలాపురే రమ్యవిశాలకేஉస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే || 12 ||
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోஉతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||
1 . గుజరాత్‌లో శ్రీ సోమనాథేశ్వరుడు
******************************
గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత.
ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.
.
2 . శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు
******************************
మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్ రైల్వేస్టేషన్ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.
పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు.
భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షన్ముఖుడికి ప్రతీచోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తీకుడిగా వెలిశాడు.
తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తప్పస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లిఖార్జునులుగా వెలిశారు.
శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాసారని ప్రతీతి.
3 . శ్రీ మహా కాళేశ్వరుడు
******************************
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది.
క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది.
ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత.
ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు.
ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.
4 . శ్రీ ఓంకారేశ్వరుడు
***************************
మధ్యప్రదేశ్ రాష్ట్రం వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం.
5 . శ్రీవైద్యనాథేశ్వరుడు
*****************************
జార్ఖండ్ రాష్ట్రంలో జేసిడీ కూడలి దగ్గర శ్రీవైద్యనాథేశ్వరాలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు.
ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం మవుతుండడం వల్ల శ్రీవైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి.
6 . శ్రీభీమేశ్వరుడు
**************************
మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది.
కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది.
ఈ జ్యోతిర్లింగం అర్థనాథేశ్వర రూపంలో భక్తులు కోర్కెలు తీర్చేదిగా ప్రతీతి.
ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత.
శివుని రౌద్రరూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం.
7 . శ్రీరామేశ్వరుడు
*************************
తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. పురాణగాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్రతీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు.
రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నూతుల్లో నీటితో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం.
8 . శ్రీనాగనాథేశ్వరుడు
****************************
మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది.
పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ.
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినపుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.
9 . శ్రీవిశ్వనాథేశ్వరుడు
******************************
శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం వారణాసిగా జగత్‌ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది.
విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.
10 . శ్రీత్రయంబకేశ్వరుడు
******************************
మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
11 . శ్రీ కేధారేశ్వరుడు
******************************
ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఉందీ జ్యోతిర్లింగం.
గౌరీకుండ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి నవంబరు నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు.
విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ.
బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికీ పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి.
ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆదిదంపతుల కళ్యాణసమయంలో హోమగుండం, నేటికీ దర్శించవచ్చు. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం ఉంది.
12 .శ్రీ ఘృష్ణేశ్వరుడు
*****************************
మహారాష్ట్ర ఔరంగబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.
No comments:
Post a Comment