Search This Blog

Monday, 15 January 2018

Tiruppavai - తిరుప్పావై 17వ రోజు పాశురము





తిరుప్పావై 17వ రోజు పాశురము


అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్ ||

ఈరోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మ ను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నిన్నీ పాశురంలో వివరించింది. నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి పంపాక, ఒక్క సారి తొంగి చూసారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు, కాని ఒక కాలికి కడియం వేసి ఉంది, మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుషా వారు కృష్ణ, బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు. ఏక్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు.

ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాళ్, "అమ్బరమే" వస్త్రములు, "తణ్ణీరే" నీళ్ళు, "శోఱే" ఆహారం, "అఱం శెయ్యుం" ఏ ప్రయోజనం ఆశించకుండా, "ఎమ్బెరుమాన్" దానం ఇచ్చే "నందగోపాలా!" నంద గోపాలా "ఎరుందిరాయ్" లేవయ్యా, అనిలేపారు.

ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది, మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం. అదే యశోదమ్మ అని అనొచ్చు, ఎందుకంటే యశస్సును ప్రసాదించేది - యశోద లేక మంత్ర రత్నం. "కొన్బనార్ క్కెల్లాం" సుందరమైన దేహ స్వరూపం కల్గి, స్త్రీ జాతి కందరికి "కొరుందే!" చిగురులాంటి దానా. "కుల విళక్కే" ఆ కృష్ణ ప్రేమ కల్గిన కులానికే ఒక దీపంలాంటి దానా "ఎమ్బెరుమాట్టి" నీవే ఆయన అనుగ్రహాన్ని కల్గించే స్వామినివి "యశోదా!" ఓ యశోదమ్మా! "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రం గా ఊహించింది అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది, ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.

అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి, అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. "అమ్బరం ఊడఱుత్తు" ఆకాశం మధ్య అంతా ఆక్రమించేట్టుగా "ఓన్గి" పెరిగి "ఉలగళంద" లోకాలను అంతా కొలిచిన, "ఉమ్బర్ కోమానే!" దేవతలందరికి నియంత అయిన స్వామి "ఉఱంగాదు" నిద్ర పోవటానికా నీవు వచ్చావు ఇక్కడికి, "ఎరుందిరాయ్" లేవయ్యా. అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీగురించి తెల్సుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాళ్ విన్నపించింది.

ఆయన లేవలేదు, అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతరంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు, బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు, ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు, ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేసారు, ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు. "శెమ్బొఱ్ కరలడి" అపరంజి బంగారు కడియం కల్గిన "చ్చెల్వా" ఓ సంపన్నుడా "బలదేవా!" బలదేవా! "ఉమ్బియుం నీయుం" నీవూ నిద్ర పోకూడదు, "ఉఱంగ్" మమ్మల్ని రక్షించు. అయితే బలరాముడు లేచి మీరు భ్రమించారు, కృష్ణుడు ఇక్కడ లేడు నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు.


Tiruppavai - తిరుప్పావై 16వ రోజు పాశురము





తిరుప్పావై 16వ రోజు పాశురము


నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్ ||

మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి. ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది.

ఆ భవనంకు ఒక తోరణం ఒక ధ్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాళ్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.

"నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ధ్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చే్రాల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ధ్వజం. ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్" మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా అని నమస్కరించారు. "మణిక్కదవం" మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళం తీయవయ్యా.

ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్లపిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, "నెన్నలే వాయ్-నేరుందాన్" నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం ఆయనచుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటే "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదయా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్" చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని.


"వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృఢంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు, ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.


Saturday, 30 December 2017

Tiruppavai - తిరుప్పావై 15వ రోజు పాశురము





తిరుప్పావై 15వ రోజు పాశురము

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్

మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.

ఈరోజు పాశురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మద్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్శి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకొని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.

అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, "ఎల్లే!" ఏమే "ఇళంకిళియే!" లేత చిలకా! "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.

కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు"నంగైమీర్!" పరిపూర్ణులు మీరే. "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.

బయట నుండి వాళ్ళు "వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్" ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక"వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.

కాని బయట నుండి,"ఒల్లై నీ పోదాయ్" ఏమే రా! మరి ఇంక, "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరొకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి"ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.

"పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై" బలం కల్గిన ఏనుగు - కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.

ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మథురానగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముష్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట.

ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.

Friday, 29 December 2017

Tiruppavai - తిరుప్పావై 14వ రోజు పాశురము



తిరుప్పావై 14వ రోజు పాశురము
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.

"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్" ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావలిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక.

"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.

అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్" ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే! "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి.

జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో "శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

Thursday, 28 December 2017

Tiruppavai - తిరుప్పావై 13వ రోజు పాశురము



తిరుప్పావై 13వ రోజు పాశురము

పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్

ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు.

వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మధ్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత వాళ్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి "సౌమిత్రే ధనుః" అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.

కృష్ణుడి జట్టు వారు "పుళ్ళిన్ వాయ్ కీండానై" ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు "ప్పొల్లా అరక్కనై" రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు. "కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్" ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.

"పిళ్ళైగళ్ ఎల్లారుమ్" గోపబాలికలందరూ "పావైక్కళం పుక్కార్" వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్పుతున్నారు. "వెళ్ళి యెరుందు" శుక్రోదయం అయ్యింది, "వియారమ్" బృహస్పతి "ఉఱంగిత్తు" అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి, ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం.

"పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు మాటలాడుకుంటున్నాయి "పోదరి క్కణ్ణినాయ్" తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా. తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టించు కోవడం లేదు. "కుళ్ళ కుళిర" చల చల్లటి ఆనీటిలో "క్కుడైందు" నిండా మునిగి "నీరాడాదే" అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. "పళ్ళి క్కిడత్తియో" ఇంకా పడుకుని ఉన్నావా "పావాయ్!" ముగ్దత కల్గిన దానా, " నీ నన్నాళాల్" సమయం అయిపోతుంది, "కళ్ళం తవిరుందు కలంద్" మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.

Tiruppavai - తిరుప్పావై 12వ రోజు పాశురము




తిరుప్పావై 12వ రోజు పాశురము

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్యజ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితికి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్షణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.

"ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే |
ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్ || "

వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు.

"దుఃఖేషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:
వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే"

ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు. ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్.

"ఇళంకత్తెరుమై" లేత దూడలు కల్గిన గేదెల "కనైత్త్" అరుపు వినిపిస్తోంది. ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నారు. "కన్ఱుక్కిరంగి" దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే "నినైత్తు" దూడ వచ్చిందని భావించి, "ములై వరియే" పొదుగుల గుండ "నిన్ఱు పాల్ శోర" ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. "ననైత్త్-ఇల్లమ్" ఇల్లంతా తడిసి పోయి , "శేఱాక్కుమ్" అంతా బురద అయ్యింది.

ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.

"నచ్చెల్వన్ తంగాయ్" ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది. "పనిత్తలై వీర" మంచుతో పైన తడుస్తున్నాం, ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం కొట్టుకుపోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి "నిన్ వాశల్ కడై పత్తి" అమ్మా నీ గుమ్మపు పైకప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .

అయితే లోపలున్న గోపబాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు "శినత్తినాల్" కోపంతో "తెన్ ఇలంగై క్కోమానై" అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి "చ్చెత్తమ్" సంహరించి, "మనత్తుక్కినియానై" అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం "ప్పాడవుమ్" పాడుతున్నా "నీ వాయ్ తిఱవాయ్" నీవు నోరు తెరవవా! "ఇనిత్తాన్ ఎరుందిరాయ్" ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా. "ఈదెన్న పేర్ ఉఱక్కమ్" ఇది ఎలాంటి నిద్రమ్మా, "అనైత్తిల్లత్తారుం అఱింద్" లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి.

Tiruppavai - తిరుప్పావై 11వ రోజు పాశురము




తిరుప్పావై 11వ రోజు పాశురము

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

గోపికలు "యుగాయితం నిమేషేన చక్షుసా ప్రాప్యుడాయితం శూణ్యాయతా జగత్ సర్వం గోవింద విరహేణమే" అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడు తమనొక నాయికగా భగవంతున్ని ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానం వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే, భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటియందు శ్రద్దలేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన భగవంతున్ని భావిస్తూ, అన్ని పనులూ భగవత్ సంబంధంగానే చేస్తారు . ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు.

ఇవాలటి గోపబాలికది దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆకర్షించేది భక్తి సౌందర్యం. ఈవాల్టి గోప బాలిక అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందినది. చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోపబాలిక. భగవత్ సేవా సంపద గొప్పగా కల్గినది కాబట్టి, ఈవిడని తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ఈవాలటి గోపబాలికను లేపుతుంది.

"కత్తుకఱవై" దూడలకు పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే "క్కణఙ్గళ్" గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల "పలకఱందు" పాలు పితకటంలో నేర్పరులు, "శెత్తార్ తిఱల్ అరియ" శత్రువుల బలం నశించేట్టుగా "చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం" వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు, "కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం" ఏపాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన "పొఱ్కొడియే" బంగారు తీగ, తీగ ఎదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది, ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ.

శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు. అదే సామూహికంగా పాదాది కేశాన్తంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు. మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి ఇలా వర్ణిస్తోంది. "పుత్తరవల్ గుల్" తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక పాములాంటి అందం కల్గి ఉండి, "పునమయిలే" ఏభయంలేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. "పోదరాయ్" రావమ్మా!! నీవెంట మేము నడుస్తాం."శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు" ఈ చుట్టూ ఉండే చెలికత్తెలు అందరూ వచ్చి, "నిన్-ముత్తం పుగుందు" నీ ముంగిట ప్రవేశించి, "ముగిల్ వణ్ణన్ పేర్-పాడ" నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం. నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని చూసి ఎలా పరుగెత్తుతూ వస్తుందో, నీలి మేఘశ్యామున్ని మేం కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, "శిత్తాదే" ఉలుకు లేదు "పేశాదే" పలుకు లేదు "శెల్వప్పెణ్డాట్టి" ఓ సంపన్నురాలా! ఎమమ్మా ఐశ్వర్య మదమా "నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్" లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి.