Search This Blog

Showing posts with label Sri Krishna. Show all posts
Showing posts with label Sri Krishna. Show all posts

Monday, 3 September 2018

౹౹ శ్రీ కృష్ణాష్టకం ౹౹ SRI KRISHNA ASTAKAM

౹౹ శ్రీ కృష్ణాష్టకం ౹౹
SRI KRISHNA ASTAKAM



*వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |*
*దేవకీ పరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 01*

*అతసీ పుష్ప సఙ్కాశం హార నూపుర శోభితమ్ |*
*రత్న కఙ్కణ కేయూరం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 02*

*కుటిలాలక సంయుక్తం పూర్ణచన్ద్ర నిభాననమ్ |*
*విలసత్ కుణ్డలధరం కృష్ణం వన్దే జగద్గురమ్ || 03*

*మన్దార గన్ధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |*
*బర్హి పింఛావ చూడాఙ్గం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 04*

*ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |*
*యాదవానాం శిరోరత్నం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 05*

*రుక్మిణీ కేళి సంయుక్తం పీతామ్బర సుశోభితమ్ |*
*అవాప్త తులసీ గన్ధం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 06*

*గోపికానాం కుచద్వన్ద కుఙ్కుమాఙ్కిత వక్షసమ్ |*
*శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 07*

*శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్ |*
*శఙ్ఖచక్ర ధరం దేవం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 08*

*కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |*
*కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి || 09*

*ఇతి శ్రీ కృష్ణాష్టకం...*


SRI KRISHNA GOVINDAM || కృష్ణం వందే జగద్గురుం || ||శ్రీ కృష్ణ గోవిందం||


|| కృష్ణం వందే జగద్గురుం ||
||శ్రీ కృష్ణ గోవిందం||



  శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఇష్టమైనవారికి జగన్నాటక సూత్రధారి. గిట్టనివారికి కపట నాటక సూత్రధారి. విలక్షణమైన వైరుధ్యాలతో మాయచేసే గమ్మత్తయిన వ్యక్తిత్వం కాబట్టే కృష్ణుడంటే అంత ఆకర్షణ. ఒకసారి చూస్తే ఇంత ఆకతాయి ఇంకెక్కడా కనిపించడు అనిపిస్తుంది. మరు నిమిషంలోనే మన సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని తెలిపే గురువు ఆయనే అన్నట్టు కనిపిస్తుంది. గోపబాలురతో ఆడిపాడినా గోవర్ధనగిరిని కొనగోటితో ఎత్తినా భారతాన్ని బాధ్యతగా నడిపించినా ఆయన ప్రతి అడుగూ మానవజీవితానికి మార్గనిర్దేశనం చేసేదే. అందుకే కన్నయ్య పుట్టిన రోజంటే (ఈరోజు కృష్ణాష్టమి) జగతికి పండగ రోజే.

శ్రావణ బహుళ అష్టమి... కృష్ణ జన్మాష్టమి. దేవకీదేవికి అష్టమ గర్భంలో ప్రవేశించిన కథానాయకుడు శ్రీకృష్ణుడు.

జన్మిస్తూనే తన నిజరూప సందర్శన భాగ్యాన్ని జననీ జనకులకు కలిగించిన మధుమోహనుడు. వారికి తన జన్మ కారణాన్నీ, వారి తక్షణ కర్తవ్యాన్నీ వివరించాడు. నందుని ఇంట నడయాడాడు. యదు కులాన్ని ఉద్ధరించాడు. బృదావనాన్ని ప్రేమతో నింపేశాడు. రేపల్లె రాగంతాళం రాజీవం చేశాడు. మరోవైపు దుష్టశిక్షణా శిష్టరక్షణా చేసి మానవజాతిని ధర్మపథాన నడిచేలా చేశాడు. మానవుడే మాధవుడిగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వం అంటే ఇదీ అని రేపటి తరాలకు చాటిచెప్పాడు. ప్రేమతో పిలిచినా, భక్తితో ధ్యానించినా, వైరంతో దూషించినా... ఇలా ఏ విధంగా తనను ఆశ్రయించినా మోక్షమిచ్చే కరుణామయుడు కృష్ణస్వామి. జీవితంలో కష్టనష్టాలూ సుఖదుఃఖాలూ ఎత్తుపల్లాలూ ప్రతీదీ ఓ భాగమే అంటాడు. వాటన్నింటిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో తన జీవన విధానంతో ఆచరించి చూపిన జ్ఞానస్వరూపుడు. గోకులంలో లీలలు చూపినా, యుద్ధం వద్దని రాయబారం నడిపినా, కురుక్షేత్రంలో వివశుడైన అర్జునుడికి గీతోపదేశం చేసినా... ప్రతిదీ మధుర ఘట్టమే. రేపటి తరానికి ఒక వ్యక్తిత్వ పాఠమే. అందుకే కంప్యూటర్‌ కంటే వేగంగా కాలానికి పోటీగా పరుగులు తీయాలని ఉవ్విళ్లూరుతున్న వేళకూడా మానవజాతి కృష్ణతత్వాన్ని వదల్లేకపోతోంది. ఆ ప్రేమతత్వాన్ని మనసావాచా మననం చేసుకుంటోంది.

*🌹ఆనందగోవిందం*

‘అధరం మధురం నయనం మధురం... మధురాధిపతే అఖిలం మధురం...’ అంటూ కన్నయ్య ముగ్ధమనోహర రూపాన్ని ఎంత కీర్తించినా తనివితీరదు. ఒక్క రూపమేనా, నల్లనయ్య... కన్నయ్య... కిట్టయ్య... గోపాలుడు... ఇలా ఆ మధుసూదనుడి పేరు తలచినా అలవికాని ఆనందమే. ‘కృష్ణుడు’ అంటేనే ‘అందరి హృదయాలనూ ఆకర్షించేవాడు’ అని అర్థం.
నిజానికి కృష్ణుడికి వశంకాని ప్రాణి ఏదీ లోకంలో లేదు. ప్రేమతో గోపికలూ, భయంతో కంసాది రాక్షసులూ, బంధుత్వంతో యాదవ పాండవులూ... ఇలా అందరూ ఆ రసరమ్య రూపాన్ని పొదివిపట్టుకోవాలని చూసినవారే. తమని తాము అర్పించుకుని తరించినవారే. మార్గాలే వేరు అందరి గమ్యమూ ఒక్కటే... కృష్ణుడిలో చేరిపోవడం. ఆయన్ను చేరుకోవడమంటే కృష్ణ తత్వాన్ని మన జీవనంలోకి ఆహ్వానించడమే. మన మనసును చైతన్యవంతంగా నిత్యనూతనంగా మహదానంద భరితంగా మలచుకోవడమే. జీవితంలో ఎదురైన ప్రతిపనిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో యుగాలనాడే చేసిచూపాడు ఆ కృష్ణస్వామి. బాలుడిగా పారాడుతూనే అమ్మచనుబాలు తాగినంత సులువుగా పూతనను తుదముట్టించాడు. చేతిలో వెన్నముద్దను పెట్టుకున్నంత ఆనందంగా గోవర్ధన గిరినిమోసి గోకులాన్ని రక్షించాడు. పూబంతులు విసిరినంత అవలీలగా పరమ రాక్షసుడైన కంసమామ గుండెలమీద పిడిగుద్దుల వర్షం కురిపించి సంహరించాడు. కాళీయుడి విషపుపడగలమీద కూడా ఆనందతాండవం చేయగల చిద్విలాసరూపుడు. వేలాది రాజుల సమక్షంలో తనను అగ్రపీఠంమీద కూర్చోబెట్టినా తన కళ్లముందే ద్వారకాపట్టణం సముద్రంలో కుంగిపోతున్నా రెండూ కర్మననుసరించి వచ్చిన ఫలితాలే అంటాడు. రెంటినీ అంతే ఆనందంగా స్వీకరిస్తాడు. సమస్య తలెత్తినప్పుడూ అదే నవ్వూ... గెలిచిన తర్వాతా అదే చిరునవ్వూ. ఆ నవ్వే కృష్ణతత్వం.
సంసారాన్ని వీడడు... ఏదీ త్యాగంచేయడు... కష్టాలు ఎదురైనప్పుడు కూడా సంతోష సాగరంలో ఎలా మునకలువేయాలో సులువుగా చేసిచూపడమే మానసచోరుడి లీలావినోదం.

*🌹పూర్ణగోవిందం*

జీవితం అంటే ఏమిటీ... అని ప్రశ్నించుకునే మనుషులకు పరిపూర్ణం నుంచి ఉద్భవించిన మానవ జన్మ తిరిగి పరిపూర్ణంలోనే కలిసిపోయే నిర్దిష్టమైన గమనమన్నాడు గీతాచార్యుడు. ఈ ప్రయాణం అంత సులువైంది కాదన్నాడు. అది బంధాలతో అల్లుకుంటుందనీ బాధ్యతలతో నిండి ఉంటుందనీ, శిఖరాలను చూపిస్తుందనీ, లోతుల్లోకి తోసేస్తుందనీ తెలిపాడు. ఎలా జీవించాలో జీవితాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో ఆచరించి చూపాడు. అందుకే కృష్ణుడి జీవితం మానవాళికి ఓ విలువైన సందేశం. నందనందనుడు నమ్మి చేరిన వారిని కాదన్న సందర్భమే లేదు. ఒకవైపు ప్రేమను పంచుతూనే మరోవైపు ధర్మాన్ని నిలబెట్టాడు. మనిషిగా పరిపూర్ణత్వాన్ని ఎలా సాధించాలో మొత్తం మానవజాతికి చెప్పకనే చెప్పాడు. కృష్ణుడు దేవుడు కాబట్టి ఆయన జీవితం అంతా ఆనందంగానే సాగిందనుకుంటే పొరపాటే. కృష్ణపరమాత్మ సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమే కావచ్చు. ఆయనలో దేవతాంశ ఉండిఉండొచ్చు. కానీ ఇవేవీ దేవకీసుతుడిని దేవుడిగా నిలబెట్టలేదు. కేవలం ఆయనలోని స్థితప్రజ్ఞత, వర్ణించనలవికాని వ్యక్తిత్వమే గోపబాలుడిని గోవిందుడ్ని చేశాయి. అవే మానవ రూపంలో జన్మించినప్పటికీ మాధవుడిగా నిలిపాయి. నడయాడి యుగాలు గడిచినా ఆయన రూపాన్ని మన మనసుపొరల్లో సుస్థిరం చేశాయి.

శ్రీకృష్ణుడి జీవితం ఆద్యంతం మానవాళిని జాగృతం చేసే గీతాపాఠమే. యద్భావం తద్భవతిగా నిలిచిన పూర్ణజ్ఞాన స్వరూపమే. నిజానికి కృష్ణుడిని అనేకులు అనేక విధాలుగా చూశారు. రకరకాలుగా అర్థం చేసుకున్నారు. అనుభూతి చెందారు. దుర్యోధనుడి మాటల్లో చెప్పాలంటే... ‘అందరితోనూ నవ్వుతూ తిరిగే అసలు సిసలైన మోసగాడు. ఏదైనా చేయగల సమర్థుడు. వయోభేదంలేకుండా ఎవరితోనైనా ఆడిపాడగల నేర్పరి...’ ఇదీ దుర్యోధనుడి అవగాహన. ‘కృష్ణుడంటేనే ప్రేమ, ప్రేమంటేనే కృష్ణుడు. ఆయన ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా ప్రేమకు వశుడే...’ ఇదీ కన్నయ్య చిననాటి ప్రేమికురాలు రాధమ్మ అనుభూతి. ‘దేవదేవుడైన శ్రీకృష్ణుడిని మించిన బలం, బలగం మరొకటిలేదు. ఆయనుండగా వేరే ఏదీ అవసరం రాదు కూడా...’ ఇదీ పాండవమధ్యముడి నమ్మకం. కృష్ణుడు పరిపూర్ణమైన విశ్వంలాంటివాడు. సూర్యుడూ చంద్రుడూ కృష్ణబిలాలూ గ్రహశకలాలూ... అన్నీ అందులో భాగమే. ఎవరు ఏది కోరుకుంటే, దేన్ని చూడాలనుకుంటే అవే కనిపిస్తాయి. కృష్ణస్వరూపమూ అంతే.

*🌹ప్రేమైకగోవిందం*

కన్నయ్యకు బంధాలంటే అమితమైన తీపి. అందుకే ఆయన అందరికీ బంధువే. ప్రతి బంధాన్నీ వెన్నముద్దల్లా అపురూపంగా ఒడిసిపట్టాడు. బంధుత్వాలను ఎలా కొనసాగించాలో చెప్పకనే చెప్పాడు. బంధాలు మనకి బంధనాలు కావనీ ఆయా రూపాల్లో భగవంతుడేననీ గ్రహించమంటూ భాగవత సూత్రాన్ని అలవోకగా వివరించాడు.

మురళీగాన లోలుడు కదా... ఆ గానం ఎంత మధురమో ఆయన ఉపదేశమూ అంతే సమ్మోహనం. మధుసూదనుడు అవతార పురుషుడే అయినా అమ్మంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అమితబలశాలి అయినా అమ్మచేతి మూరెడు తాడుకు కట్టుబడ్డాడు. అందుకే పోతన సైతం చిన్నికృష్ణయ్య లీలను ఇలా చెబుతాడు...

చిక్కడు సిరి కౌగిటిలో
జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్‌
జిక్కడు శృతిలతికావలి
జిక్కెనతండు లీల దల్లి చేతన్‌ రోలన్‌

... యోగుల తపస్సులకు సైతం అందలేదు. అమ్మవారి బిగికౌగిలిలోనూ ఇమడలేదు. అలాంటి అనంతాకారుడు అమ్మప్రేమకు బందీ అయ్యాడు మరి. అన్న బలరాముడన్నా ఆయనకు అలవికాని అనురాగం. అంతకు మించిన గురు భావం. మరోవైపు అన్నగా నిలబడి సుభద్రా కళ్యాణాన్ని ముందుండి జరిపించాడు. సోదరికి సవతి అయినా ద్రౌపదినీ తోబుట్టువులాగే ఆదరించాడు. చీరకొంగును చింపి వేలికి చుట్టినందుకే పరమానంద భరితుడయ్యాడు. అది ఆమె మెట్టినిల్లే చూట్టూ ఉన్నది సొంతవాళ్లే అయినా అయిదుగురు భర్తలూ పక్కనే ఉన్నప్పటికీ... కష్టకాలంలో ద్రౌపదికి తోడునిలిచింది కన్నయ్యే. అన్నా అంటూ ఆర్తిగా పిలవగానే అక్కున చేర్చుకున్నాడు. చీరలు అందించి ఆమె మానాన్ని కాపాడాడు. భీష్మాచార్యుడు యోధుడు.

వరసకి తాత. కృష్ణుడంటే అమితమైన ప్రేమ. ఆయనంటే కన్నయ్యకూ అంతే గౌరవం. కానీ కౌరవ పక్షాననిలిచి ఆయనకు వ్యతిరేకంగా పోరాడాడు. నేలకొరిగే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం ఆయన కృష్ణుడి సాన్నిధ్యాన్నే కోరుకున్నాడు. మాధవుడు వచ్చేవరకూ ప్రాణాలు అరచేతపట్టుకుని ఎదురుచూశాడు. అలాగే స్నేహం ఎలా చేయాలో స్నేహితులు ఎలా ఉండాలో కృష్ణుడిని చూసి ఈతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జతగాడైన కుచేలుడిని ఆదుకున్న తీరు అద్భుతం. కుచేలుడు నిరుపేద. శ్రీకృష్ణుడు రాజ్యాధినేత. మొహమాట పడుతూ తనవద్దకు వచ్చిన నేస్తాన్ని అడిగిమరీ అటుకుల మూట తీసుకున్నాడు. అడక్కపోయినా సకలసౌభాగ్యాలూ ప్రసాదించాడు. స్నేహితుడిని సమాదరించి, స్నేహబంధం అన్నింటికీ అతీతమైందని నిరూపించాడు కృష్ణస్వామి.

*🌹జ్ఞానగోవిందం*

పదవులకోసం పాకులాడటం, స్కాంల కోసం స్కీంలు వేయడం కాక రాజకీయమంటే ఏమిటో, దాన్ని రసవత్తరంగా ఎలా నడపాలో చూపిన రాజకీయ దురంధరుడు శ్రీకృష్ణుడు. ధర్మ రక్షణ కోసం ఆ మధుసూదనుడు నెరిపిన రాజకీయ చదరంగమే కురుక్షేత్ర యుద్ధం. దుష్టులను శిక్షించడానికీ ధర్మం పక్షాన నిలబడటానికీ మాధవుడు వేయని ఎత్తుగడ లేదు, చేయని రాజకీయం లేదు. కాళీయ మర్దనం నుంచీ కురుక్షేత్ర సంగ్రామం వరకూ ప్రతిదీ కన్నయ్య ప్రణాళికే. అంతటి రాజనీతిజ్ఞుడు మరొకడుండడు. మహాభారతాన్ని రాజకీయకోణంలో చూస్తే కృష్ణుడిదే కీలక పాత్ర. కౌరవుల దుర్మార్గాన్నీ, దుర్బుద్ధినీ దెబ్బతీయడానికి తానే స్వయంగా రంగంలోకి దిగాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తాను కావాలా లేక కోట్ల సైన్యం కావాలా అని ప్రశ్నించి తెలివిగా తప్పుదోవ పట్టించాడు. రథ, గజ, తురగ పదాతి దళాలను కౌరవుల పరం చేసి, తానొక్కడు మాత్రం పాండవుల పక్షం వహించాడు. సర్వవేదాంత సారమైన గీతా శాస్త్రాన్ని మానవాళికి అందించాడు. కురుక్షేత్ర రణరంగంలో సారధిగా అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసి మార్గదర్శి అయ్యాడు. ధర్మాన్ని రక్షించడానికి పాండవుల పక్షాన చేరి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు. మహాభారత సంగ్రామంలో పాండవులకే విజయాన్ని కట్టబెట్టి అంతిమ విజయం ధర్మానిదేనని రుజువుచేశాడు. బలగం కంటే బలం, జ్ఞానం కంటే బుద్ధీ గొప్పవని చాటిచెప్పాడు.

*🌹గురుగోవిందం*

నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో కృష్ణయ్య యుగాలనాడే చూపించాడు. ముందుండి నడిపేవాడు సమస్యలకూ, సవాళ్లకూ భయపడిపారిపోకూడదు. చివరివరకూ విజయం మనదేనన్న భావంతో పోరాడాలి. తన బృందంలోనూ అదే స్ఫూర్తిని నింపాలి. గోకులంలో ఉన్నప్పుడు ఊరి సమస్యను తనదిగా భావించాడు కాబట్టే గోకులాన్ని రక్షించడానికి గోవర్ధనగిరిని చిటికెనవేలిమీద మోశాడు. తనవారికి కష్టం వచ్చినప్పుడు తాను ముందుండి పోరాడి జగత్తుకి దిశానిర్దేశం చేశాడు. జీవితమంటేనే పోరాటమని తెలిసినవాడు కాబట్టే జరాసంధుడితో పదిహేడుసార్లు యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు. యుద్ధంలో ఓడిపోయే సందర్భం ఎదురైన ప్రతిసారీ జరాసంధుడు పారిపోయేవాడు. కానీ మళ్లీ బలం పుంజుకుని యుద్ధానికి సై అనేవాడు. దీంతో వరుస యుద్ధాలు చేయక తప్పలేదు కన్నయ్యకు. సమస్యలకు దూరంగా ఉండటమే కాదు, అపాయంలో ఉపాయం ఎలా ఆలోచించాలో చేసి చూపాడు. ఎప్పుడూ ఎదురెళ్లి పోరాడటమేకాదు ఒక్క అడుగు వెనక్కివేసినట్టు కనిపించైనా శత్రువుని తుదముట్టించడమూ ఆయనకి తెలుసు. కాలయవనుడి ఉదంతంలో కృష్ణుడు ఈ ఎత్తుగడనే వేశాడు. అక్షౌహిణులకొద్దీ సైన్యంతో తనమీద యుద్ధానికి వచ్చిన కాలయవనుడికి నిరాయుధుడై ఎదురునిలిచాడు. భయపడినట్టు నటించాడు. కొండకోనల్లోకి పరుగులు తీశాడు. ఓ పాడుబడ్డ గుహను చేరాడు. ముందూ వెనకా ఆలోచించకుండా కన్నయ్యనే వెంబడిస్తూ గుహలోకి అడుగుపెట్టాడు కాలయవనుడు. గాఢాంధకారంలో నిద్రపోతున్న ఓ వృద్ధుడిని చూసి శ్రీకృష్ణుడిగా భ్రమించి ముచికుంద మహర్షిని తట్టిలేపాడు. ఆ ముని ఆగ్రహంతో కళ్లుతెరిచేసరికి నిలువునా భస్మమైపోయాడు. అదీ గోవిందుడి వ్యూహమంటే. భారతంలోనూ అంతే, పాండవ పక్షపాతిలా కనిపించినా వారికీ ఏమీ చేసినట్లుండడు. దుర్యోధనుడితోనూ మంచిగానే ఉన్నట్లు కనిపించినా... ఏ సహాయమూ చేయడు. కానీ తాను నిలిచిన పక్షపు బలాబలాలను తెలుసుకుంటూ ఎత్తూలూ పై ఎత్తూలూ వేస్తూ పాండవులను విజయపథాన నడిపించాడు. నాయకుడు ప్రణాళిక, వ్యూహం అన్నీ సమపాళ్లలో రంగరించి బృందాన్ని ముందుకు నడిపించాలనీ, కదనరంగంలో కత్తిపట్టితీరాలనేమీ లేదనీ వ్యవహారాన్ని చక్కదిద్దే నేర్పు ఉంటే చాలనీ చాటిచెప్పాడు. శ్రీకృష్ణుడనే నాయకుడే లేకపోతే పాండవుల విజయాన్ని ఊహించనేలేం.

భాగవత భారతాల్లో మరపురాని మధుర ఘట్టాలకు మూలకారకుడు మాత్రమే కాదు, మానవులకు జీవిత పర్యంతం పాఠాలు నేర్పే జగద్గురువు శ్రీకృష్ణుడు. జీవితంలోని ప్రతిదశనూ పరిపూర్ణంగా ఆస్వాదించాడు గోపాలుడు. చిలిపి
అల్లరితో తన బాల్యాన్ని తరతరాలకూ చిరస్మరణీయం చేశాడు. మధురమైన మురళీ గానంతో ప్రకృతిని సైతం ఆనందడోలికల్లో ఓలలాడించాడు. తలచినంతనే చెంతచేరి పదహారువేల మంది గోపికల్నీ ప్రేమధారల్లో ముంచెత్తాడు. మేధాశక్తితో నారితో సైతం వింటినారిని పట్టించాడు. యుద్ధంలో పాంచజన్యాన్ని పూరించి శత్రువుల గుండెల్లో భయాన్ని నింపాడు. అయినా... ఏ మూసలోనూ ఒదగడు. ఏ అధికారానికీ లొంగడు. అందుకే శ్రీకృష్ణుడు ‘అయినవాడే అందరికీ - అయినా అందడు ఎవ్వరికీ’!


Saturday, 19 May 2018

DWARAKA - సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక


DWARAKA

సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక



192 కిలోమీటర్ల పొడవు... 192 కిలోమీటర్ల వెడల్పు.. 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. బారులు తీరిన వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. రాయల్‌ ప్యాలెస్‌లు.. రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు.. కమర్షియల్‌ మాల్స్‌.. కమ్యూనిటీ హాల్స్‌.. క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం.. రత్నస్తంభాలు.. వజ్ర తోరణాలు.. సాటిలేని ఆర్కిటెక్చర్‌.. సముద్రం మధ్యలో మహా నిర్మాణం.. జగన్నాథుడి జగదేక సృష్టి.. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి లెజెండ్‌ సిటీ... ద్వారక.. ఇప్పుడు సాగర గర్భంలో.. మన నాగరికత.. మన సంస్కృతి.. మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ.. ద్వారక ---------------------------- అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం.. ద్వాపర యుగం నిజం.. వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత నిజం.. అపూర్వమైన మన సైన్స్‌ నిజం.. సాటి లేని మన ఇన్వెన్‌షన్స్‌ నిజం.. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక.. గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా.. 1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక.. ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే.. కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది.. మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్‌ ఏస్‌.ఆర్‌. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు.. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది.. శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి... మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు.. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు.. శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది.. ------------------- ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్‌ నాగరికత కూడా మాయమైపోయింది.. మనం అన్నీ మర్చిపోయాం.. మన కల్చర్‌ గురించి మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు. ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం కూడా అలాంటిలాంటి సెユ్టల్‌ కాదు. ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి.. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట.. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి.. పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక.. నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి..
కమర్షియల్‌ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా పబ్లిక్‌ యుటిలిటీస్‌, భారీ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఉన్నాయి.. బ్యూటీకే.. బ్యూటీ... అందమైన గార్డెన్‌లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు. ---------------------------- రామాయణ కాలంలో రావణుడి ఎయిర్‌పోర్ట్‌లను కనుగొన్నాం.. అతని ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం.. భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది.. భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.. కాల గర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది.. న్యూయార్క్‌ సిటీ, వాషింగ్టన్‌ డిసి, లండన్‌, మాస్కో, బీజింగ్‌, టోక్యో, ముంబయి.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే, చాటుకునే మహానగరాలు.. మెట్రో పాలిటన్‌ సిటీలు.. కాస్మో పాలిటన్‌ సిటీలు.. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాళ్టి రూపానికి రాలేని నగరాలు.. ఈ మెట్రో, కాస్మో పాలిటన్‌లకు వేల రెట్లు అడ్వాన్స్‌డ్‌ అభివృద్ధితో అపురూప నగర నిర్మాణం ఆనాడే జరిగింది. అదే ద్వారక.. ఇక్కడ కేవలం కమర్షియల్‌ జోన్లు ఏర్పాటు చేయటమే కాదు. సాగర తీరంలో గొప్ప హార్బర్‌ను కూడా యాదవ రాజులు సక్సెస్‌గా నిర్వహించారు. గ్రీకు, ఇతర దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ ఎస్‌ఆర్‌ రావు పరిశోధనల్లో ద్వారక ఆరు ప్రధాన రంగాల్లో ద్వారక అభివృద్ధిని సాధించిందని ధృవీకరించారు. ద్వారకను ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి గా పిలిచేవారని కూడా తేల్చారు.. క్రీస్తుపూర్వం 3138లో మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు.. ఆ తరువాత యాదవ రాజుల మధ్య పరస్పరం గొడవలతో ఒకరికొకరు చంపుకున్నారు.. ఆ తరువాత కొంతకాలానికే శ్రీకృష్ణుడు దేహ పరిత్యాగం చేసి భూమిని విడిచివెళ్లిపోయాడు..ఈ భూమిపై కృష్ణుడు నివసించింది 120 సంవత్సరాలు. కృష్ణ నిర్యాణానంతరం ద్వారకను సముద్రం ముంచివేసింది. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే తాను ప్రత్యక్షంగా చూసినట్లు అర్జునుడు మహాభారతంలో చెప్తాడు.. సాగర గర్భంలో మునిగిపోయింది మునిగిపోగా.. తీరం వెంట కూడా ద్వారకకు సంబంధించిన, కృష్ణుడి రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం కనిపించే ద్వారకాధీశ్‌ ఆలయం కూడా కృష్ణుడి మనవడు వజ్రనాభుడే నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది...అసాధారణ భారతీయ ప్రతిభకు, నాగరికతకు, సంస్కృతికి ఎవరెస్ట్‌ శిఖరమంత కీర్తి -కృష్ణ ద్వారక.