Search This Blog

Monday, 15 January 2018

Tiruppavai - తిరుప్పావై 22వ రోజు పాశురము




తిరుప్పావై 22వ రోజు పాశురము

అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్

మనిషి వస్తువులపై ఏర్పర్చుకున్న అభిమానము, ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుతూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవవల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచిపోయాడట. వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు. ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉందట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచింది. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తుపట్టేసరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. "ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కాన ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్" ఏక ఛత్రాధిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒక నాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.

మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్నా అనుకుంటావా చుట్టూ ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతికితే వాడికి గతి ఉండనే ఉండదు.

"అంగణ్ మా ఞాలత్తరశర్” ఈ అందమైన భూమి మీద అబిమాన పంగమాయ్ వందు” అభిమానాలను వదులుకొని వచ్చి “నిన్ పళ్ళికట్టిల్ కీరే” నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలే మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి. ఈ దేహాలపై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పదసన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మనలాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకొని రావాలనంటే అది కష్టం, కాని తరించాలి అంటే ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.

“శంగమ్ ఇరుప్పార్ పోల్” అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లాఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము. “వందు తలై ప్పెయ్-దోమ్” ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి, మాకు ఎంతలా ఉపకారం చేసావు, మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేషాన్ని తగ్గించి నీ పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం.

ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, “కింగిణివాయ్ చ్చేయ్ద” చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే, అట్లా కనిపించే ఆనేత్రాలని “తామరై ప్పూప్పోలే” పద్మాల్లా “శెంగణ్ శిఱుచ్చిఱిదే” అందముగా, మెల్లి మెల్లిగా “యెమ్మేల్” మాపై “విరయావో” ప్రసరించేట్టు చెయ్యి. “తింగళుమ్” చంద్రుడి చల్లటిచూపులాగా “ఆదిత్తియనుమ్” సూర్యుడి కాంతివలె “ఎరుందాఱ్పోల్” ఇద్దరూ కలిసి నట్లుగా ఉంది, ప్రేమించేవారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేషించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి “ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం” అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తే ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.

తప్పు తప్పు “అంగణ్ ఇరండుం” ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు, “కొండు ఎంగళ్మేల్” వాటిని మాపై పడేట్లు చెయ్యి. “నోక్కుదియేల్ ఎంగళ్మేల్” ఆచూపులు మాపై పడితే “శాపం ఇరింద్” మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్శతో పోయింది - మాకూ నీ పాద స్పర్శ కావాలి, చంద్రపుష్కరిణిలో స్నానం ఆడితే దక్షుడికి శాపం పోయింది - మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణిలో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది - మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి. “చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన” నీ చూపు నాపై పడిందయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.

Tiruppavai - తిరుప్పావై 21వ రోజు పాశురము




తిరుప్పావై 21వ రోజు పాశురము

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్

భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ, "న సంశయోస్తి తత్ భక్త పరిచర్య రతాత్మనామ్" ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించేట్టి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ది తప్పక కలిగే తీరును, సంశయం అక్కర లేదు అని నిరూపిస్తారు. అయితే ఆచార్యులయందు విశ్వాసం కలగటం కొంచం కష్టం, ఎందుకంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు. భగవంతుణ్ణి చేరటానికి వీరు తోర్పడుతారని విశ్వాసం కలగదు. ఆండాళ్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించని దానివైపు సాగవలే అని నేర్పుతుంది. ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి, ఒకటి ఇక్కడ భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడిమీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించే సరికి మనకు నమ్మకం కలగటం కొంచం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు, ఇతర యుగాల్లో కృష్ణుడిగా, రామునిగా కనిపించేట్టు తానూ వచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులేకాదు వేదాధ్యయనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు.

ఇంద్రుడు దేవతలకి అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు. అందరూ ఇంద్రుడికి అర్పించటానికి పదార్థాలను తయారుచేస్తున్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతలకి అధిపతి, ఒక ఉద్యోగి. ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడికి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనుకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. వాళ్ళకందరికి ఈ విషయం ఎలాగో తెలుపాలి అని అనుకుని, అందరినీ ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు, సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే, ఆపై గాలి వీస్తే మన దగ్గరకు వచ్చాయి, ఆ గోవర్థన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్థన పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నవించుకున్నాడు. అందరికి సభబే అనిపించి అందరూ ఆ గోవర్థన పర్వతానికే పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి, నైవేద్యం పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రాల్లవాన కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు కన్నయ్యా అని అందరూ కృష్ణుణ్ణి చేరగానే, మనం ఆరగింపు ఇచ్చిన ఆ కొండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలితో కొండను ఎత్తి అందరిని రక్షించాడు. గోవర్థనోద్దారి అయ్యాడు ఆయన. ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు, ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడేకదా, అదే శ్రీకృష్ణార్పణ మస్తూ అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ది చేప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడంతటి వానికే తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మన లాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం.

అయితే ఇంద్రుడు దేవతలలో ఒకడు, మరి ఆ దేవతలందరికి అదిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే, బ్రహ్మకు కూడా అసూయ కలిగి, ఇదేదో చూడాలి అని గోకులంకు వచ్చాడట. ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలుర మద్య కూర్చుని సద్దులు ఆరగిస్తుండగా చూసి, ఈ ఎంగిలి వేషాలు వేసే వాడా దేవుడంటే అని అనుకుని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలె అని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు. అంతలో ఒక గోపబాలుడు వచ్చి కృష్ణా మన గోవులు కనిపించటం లేదు అని చెప్పాడు, కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే, గోపబాలురనూ అపహరించి మరొక గుహలో దాచాడు బ్రహ్మ. అయితే గోపబాలురను వదిలి వెడితే గోకులంలోని వారంతా కృష్ణుణ్ణి దేహశుద్ది చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ. ఇక బ్రహ్మలోకంకి బయలుదేరాడు బ్రహ్మ. ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నెన్ని దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందరెందరి గోపబాలురను బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు. అందరి రూపాలు ఆయనే దాల్చాడు, వారి వారి ప్రవృత్తులతో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు. గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా ఆనంద తరంగితం అయ్యింది. ఇక్కడిది చేస్తూ బ్రహ్మ లోకం వెళ్ళి బ్రహ్మ రూపు దాల్చి అక్కడివారితో, తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు బాగా శుద్ది చేయండి అని చెప్పి వచ్చాడు కృష్ణుడు. బ్రహ్మకు తనలోకంలో కూడా ఆదరణ లేకుండాపోయి నంద గోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడ, ఎక్కడి గోవులు అక్కడ కనిపించాయి. ఆశ్చర్య పడి తాను దాచిన గుహల్లో చూస్తే తను దాచినవి కనిపించాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే కనిపించాడు. అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి స్వరూపాన్నీ కీర్తన చేసి, ఎందుకిచ్చావీ బ్రహ్మ పదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడ నాకు పెరిగింది. ఈ గర్వం లేని గోపజనం ఎంత అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాద దూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు పశ్చాత్తాపం చేందాడు.

అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు దరించే సరికి మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది. కనిపించక పోతే అమ్మో అంటాం, కనిపిస్తే ఓసీ ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ, ఇంద్రులకి కనిపించే వాడిపై విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేకపోవటం. అదే భగవంతుడు ఈనాడు అర్చా స్వరూపంలో ఉన్నాడు. అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని అది అగ్నిహోత్రంలో, ఆదిత్యునిలో, జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలని చెప్పారు. సామాన్యులకి మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహాంలో చూడొచ్చు, ఆపై విగ్రహం లేకుండా శక్తిరూపాల్లో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పారు. కాని అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పైపైకి చూపిస్తూ ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చ కుండానే చైతన్యంచే కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం. "ప్రతిమాసు అప్రబుద్దానాం" అంటే విగ్రహం అనేది వీటికంటే ఎదో పైకే చెంది ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది, తత్వం బట్టి కదా, అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేక విగ్రహంలో గుర్తిస్తాడు. అలాంటివాడు బాహిరమైన వాటియందు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగంటే, ఒక విద్యుత్ తీగను చూసి అదేం కాలటంలేదు, వెలగటం లేదు అని ముట్టు కుంటే ప్రాణం తీస్తుంది. కాని అదే తీగ అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ బాహిరమైన వాటియందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలక పోయినా, భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు, చివరి మెట్టు కూడా. విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, "విగ్రహమే తత్వం" అని గుర్తించాలి.

ఆండాళ్ తిరుప్పావై సారాంశం ఆ విగ్రహం పై విశ్వాసం కలిగించటమే. అందుకే ఆండాళ్ శ్రీవెల్లిపుత్తూర్ లో వటవత్రశాయిని కొలిచింది, వేంకటాచలపతికి శరాణాగతి చేసింది, తిరుమాలైజోలు సుందరభాహునికి మొక్కుబడి చేసింది, శ్రీరంగనాథున్ని చేరింది, శ్రీకృష్ణుడిని మనస్సులో భావించింది, పాల్కడలిలో స్వామిని పాడింది. ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించవలెనని తెలిపింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చునని తెలియజేసింది. మొదట ఆ విశ్వాసపూర్ణత మనకు ఏర్పడితే, ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలం.

నిన్న అమ్మని లేపారు, ఆమ్మ లేచి నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కల్సి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మనవాళ్ళంతా స్వామి వద్దకు చేరి "శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే" అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు, అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేసారు. ఈరోజు మనవాళ్ళు "మగనే!" కుమారుడా "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో అంటున్నారు. ఐతే మనవాళ్ళకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు, అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ "ఆత్త ప్పడైత్తాన్" లెక్కకు అందనన్ని "వళ్ళల్ పెరుం పశుక్కళ్" ఇచ్చే ఔదార్యం కల్గిన పశువులు, శ్రీకృష్ణుడికీ ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది. ఇచ్చే స్థితి తనది, పుచ్చు కొనివాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి, ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే "ఏత్త కలంగళ్" ఎన్ని కుండలు పెట్టినా, "ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియుమ్" పాల ధారలు పొంగుతుంటాయి, ఆ పొంగటం క్రింది నుండా పాలు పొంగుతున్నాయి అన్నట్లు ఇచ్చేవి. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు, ఆ శాస్త్రములు కఠినమైనవి, గోవులు వనం అంతాతిరిగి అక్కడి పచ్చికను తిని, అనుభవించి మనకు స్వచ్చమైన పాలను అందించినట్లే, జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడి క్లేషాలను తాము అనుభవించి తత్-సారమైన భగవత్-గుణములైన పాల దారలను మనపై కురిపిస్తారు. కుండలు శిష్యులలాంటివి అనుకోవచ్చు, ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు, తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, ఆవలివాడు అడుగుతున్నాడే అని కొందరు, ఆవలివాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు, తమకు తెల్సింది చెప్పకుండా ఉండలేక కొందరు ఇస్తుంటారు. అలాంటి జ్ఞానులనెందరినో శిష్యులుగా కలవారు మన రామానుజాచార్యులవారు. అలాంటి ఆచార్యులవద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి. పరమపదంలో నిత్యశూరులవద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా, తనను తాను తెలియనివాడైనందుకే కదా, మా మద్యకు వచ్చి మా అరాధన అందుకుంటున్నావు, ఇది మా పాలిట నీదయ. "ఊత్త ముడైయాయ్! పెరియాయ్!" నీకు దృడమైన ప్రమాణం నీకుంది వెనకాతల, వేదైక వేద్యుడివి, ఆ వేదానికే అందనివాడివి, అలా అందనివాడివి "ఉలగినిల్ తోత్తమాయ్ నిర్ఱ" మా మద్యకు అందే వాడిలా వచ్చి "శుడరే!" దివ్య కాంతులీడుతూ ఉన్నావు, మేం క్రమం తప్పకుండా మీ అమ్మ నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం "తుయిల్ ఎరాయ్" తెలివి తెచ్చుకో. వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నపించుకున్నారు "మాత్త్తార్" శత్రువులైన వాళ్ళు "ఉనక్కు వలి తొలైందు" వాళ్ళ బలాన్ని ప్రక్కన పెట్టుకొని "ఉన్-వాశఱ్కణ్" నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళలా "ఆత్తాదు వందు" ఎక్కడైతే నీ బాణాల దెబ్బలకు బయపడి "ఉన్-అడిపణియుమా పోలే" నీపాదాలనే సేవించుకొనేట్లుగ వస్తారో, మేం అలానే వచ్చాం, దీంతో స్వామికి బాధ అయ్యి, మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా బాధపడ్డాడు, లేదయ్యా "పోత్తియాం వందోమ్" మేం కూడా ఒకనాడు వాళ్ళకేం తిసిపొలేదయా, ఒకప్పుడు మేం అభిమానం కల్గి మేం నీ దగ్గరకి రావటం ఏంటి అనుకునే వాళ్ళం, కానీ నీవంతటివాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మాదగ్గరికి కూడా రాగలవు, కానీ మేం ఆగలేక పోతున్నాం, అర్తి తట్టుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము. అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్నీ కాపాడుకోవటానికి నీ దగ్గరికి శరణూ అంటూ వస్తారు. మేం మా ఆత్మరక్షణ కోసం వచ్చాం, వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం, వాళ్ళు నీ బాణాల దెబ్బలకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోక నీ కళ్యాణగుణాల కీర్తన చేద్దాం అని వచ్చామయ్యా "పుగరందు" ఆనందంతో వచ్చాం, ఇక పై అంతా నీ భాద్యత అంటూ శరణాగతి చేసారు.

Tiruppavai - తిరుప్పావై 20వ రోజు పాశురము




తిరుప్పావై 20వ రోజు పాశురము

ముప్పత్తు మూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్

అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం, మరి అమ్మను కఠినంగా మట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది, నిన్న మన వాళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడే సరికి స్వామికి కొంచం కోపం వచ్చింది, అందుచే స్వామి లేచి రాలేదు. ఈ రోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు, ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, బలం, ఋజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. అయినను లేవలేదని, ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు.

ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొల్పడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు. "ముప్పత్తు మూవర్ అమరర్క్కు" ముప్పై మూడు వర్గాల దేవతలను "మున్ శెన్ఱు" ఆపదరావడానికంటే ముందే వెళ్ళి కాపాడే "కప్పం తవిర్క్కుం కలియే!" గొప్ప భలం కలవాడివే. "తుయిల్ ఏరాయ్" లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు, ఏమాత్రం కోరిక లేకుండా, కేవలం నువ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా, మేం నీదగ్గరికి రావడం తప్పైందా.

"శెప్పం ఉడైయాయ్!" సత్య పరాక్రమశాలీ, అడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి, మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? ఏమైంది నీ మాట. "తిఱలుడైయాయ్" సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా! "శేత్తార్క్కు వెప్పమ్కొడుక్కుం విమలా!" శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చే నిర్మలుడా, ఏ దోషం అంటనివాడా. "తుయిల్ ఎరాయ్" నిద్ర లేవయ్యా.

అయితే స్వామి లేవకపోయే సరికి, అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా. "శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్" సముదాయ అంగ సౌందర్యం కల్గి, "నప్పినై" స్వామి సంబంధంతో "నంగాయ్!" పరిపూర్ణమైన అందం కలదానా! "తిరువే!" సాక్షాత్తు నీవే లక్ష్మివి "తుయిలెరాయ్" అమ్మా మేల్కో.

వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి, లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఏం కావాలర్రా అని అడిగింది. "ఉక్కముమ్" స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి, "తట్టొళియుమ్" స్నానం తర్వాత అలంకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి, "తందు" ఈ రెండు ఇచ్చి "ఉన్మణాళనై" నీ స్వామిని "ఇప్పోదే" ఇప్పుడే "ఎమ్మై" మాతో కలిపి "నీరాట్టు" నీరాడించు. ఇలా అడగటం మనకు కొంచం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది. కాని దోషమేమి లేదు.

పురుషుడు ఆయనొక్కడే మిగతా జీవ వర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు, కొందరు వెనక ఉన్నవారుంటారు. ముందున్న వారు వెనక వాళ్ళకు మార్గ నిర్దేశం చేస్తారు. అక్కడ పరమ పదంలో నిత్యశూర వర్గానికి చేందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి, ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని సరిగా చూప గలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరుకి వెళ్ళి అక్కడ చెఱువులో స్నానం చేయాలంటే ఆ వూరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా, అలాగే.

కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెబుతూ

"హరి సరస్సివి గాహ్య ఆపీయ తేజోజలౌగం
భవమరు పరి ఖిన్నః ఖేదమద్య త్యజామి"

హరీ అనేది ఒక గొప్ప సరస్సు, సంసార తాపాన్ని తొలగించ గలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే. తాపం తగ్గాలనుకొనేవారంతా అక్కడే మునగాలి, వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ, పరమ పదంలోని నిత్యశూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు, అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది.

ఆ హరి సరస్సు గురించి తెలిసినదానివి, నీవు మార్గం చూపిస్తే మేం దాంట్లో ప్రవేశించగలం అని, అమ్మ ఆండాళ్ తల్లి నీళాదేవిని అదే కోరుతుంది. పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పని చేస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణగుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కల్సి మార్గ నిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కల్సి మేల్కోల్పుతారు.

Tiruppavai - తిరుప్పావై 19వ రోజు పాశురము





తిరుప్పావై 19వ రోజు పాశురము

కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్

మనిషికి ఎన్ని శాస్త్రములు బోధించినా, శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై. శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపచేసేది, కాని దాన్ని మనిషి ఇష్టపడతాడు, దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటీ అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది.

"కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాది మంగళమ్" అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం, అమ్మ తన వక్షస్తలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది, ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు, ఓహో అలాంటి స్వామీ నీకు మంగళం. ఏమిటండీ ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు. కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా! లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది, కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకూ ఒక బ్రతుకేనా! అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించ దగినది కానీ అనుభవించ దగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది - ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి, అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది.

నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది, కాని అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని, నేనే తెరుస్తాలే అని ఒక్క సారి అమ్మ చేయి లాగే సరికి ఆవిడ ఆయన వక్షస్తలం పై వాలిపోయింది. ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై సృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరమవుతానేమోనని స్వామిని వదలలేదు. వీళ్ళు బయటనుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు.

"కుత్తు విళక్కెరియ" చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి, ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి, అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా!! నీవు తలుపు తెరువడం లేదు సరికదా స్వామినీ తలుపు తెరువనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు.

గతంలో కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీళాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. "కోట్టుక్కాల్" ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల "కట్టిల్మేల్" కట్టె మంచంలో "మెత్తెన్ఱ" మెత్తటి అతి సుకుమారమైన, "పంచ శయనత్తిన్" పంచశయనంపై "మేల్ ఏఱి" పడుకొని ఉన్నారు. "కొత్తలర్ పూంగురల్" గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల "నప్పిన్నై" ఆ అందగత్తె "కొంగైమేల్" వక్షస్థలం "వైత్తు క్కిడంద" స్పర్శచే మైకంలో పడి ఉన్న "మలర్ మార్బా!" వక్షస్థలం వికసించి ఉన్న స్వామీ "వాయ్ తిఱవాయ్" నోరైనా తెరువచ్చుకదా.

అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ వద్దూ నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటిచూపుతోనే వద్దని అనటంతో, బయటనుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటంలేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు. "మైత్తడం కణ్ణినాయ్!" కాటుకతో విశాలమైన కన్నులు కల "నీ" నువ్వు "ఉన్-మణాళనై" నీ స్వామిని "ఎత్తనై పోదుం తుయిలెర" ఇప్పటికైనా లేపి "ఒట్టాయ్ కాణ్" మాకు చూపించవా, "ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్" ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా, "తత్తువమన్ఱు తగవ్" నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచం కఠినంగా పిలిచారు.

Tiruppvai - తిరుప్పావై 18వ రోజు పాశురము




తిరుప్పావై 18వ రోజు పాశురము

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్

ఈ రోజు ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి, ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషాకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం. ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం. మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి, అయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను. తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు, కాని ఇప్పుడు బాగుపడదాం, అయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు, ఆయనకు మనలోని దోషాలు కనబడొద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి, అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీ దేవి. ఆయనలోంచి దయ,వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికీ ఆ భగవంతునికి మధ్యవర్తి గా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను "శ్రీ" అంటారు.

లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవవర్గానికి నామ రూపాలు ఇచ్చేది స్త్రీ, అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చి దిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ, అంటే ఒకనాడు మనం నామ రూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది, ప్రళయ కాలంలోకూడా. అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి, మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయొచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషాకారం అంటారు.

అందుకే మన ఆలయాల్లో అమెకొక సన్నిధి ఉంటుంది, మొదట మనం మన బాధలు ఆవిడతో చెప్పుకోవాలి, అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్తలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజు మన ఆండాళ్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు, ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మనకోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఃఖిస్తే, వారు బాగుపడేంతవరకూ తన దుఃఖంగా భావించటం. వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, "వాత్సమ్" అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, "ల" అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా "అగలగిల్లేన్ ఇరయుమ్" అర క్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయట పడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్రేయోదాయకం.

అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది, ఆయన వరాహస్వామి గా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది, ఆయన రాముడయితే అమె సీతగా వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీళా దేవిగా వచ్చింది. భాగవతంలో మనకు నీళాదేవి అనే పేరుతో ఎవ్వరు కనిపించరు. రాధగానో, రుక్మిణి గానో, సత్యభామగానో మనకు తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తుత్వాన్ని చేయగలిగినవారు కాదు. మరి ఆయనకుండే పదహారువేల మందిలో ఎవరు నీళాదేవి అని గుర్తించేది? అయితే ఆయనకున్న ఎనుమండుగురు పట్టపు రాణుల్లో ఒక ఆవిడపేరు నాజ్ఞజితి. శ్రీకృష్ణుడు నీళాదేవిని ఎట్లావివాహం చేసుకున్నడని మన సంప్రదాయం తెలియ జేస్తుందో అలాగే ఈ నాజ్ఞజితిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతని వివాహమాడాటానికి శివధనస్సును చేదించినట్లే, ఈవిడని వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి నీళాదేవే పురుషాకారం అంటారు. ఈరోజు నీళాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతుంది.

"ఉందు మదకళిత్తన్" మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు "ఓడాద తోళ్ వలియన్" ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు, అలాంటి "నంద గోపాలన్" నందగోపాలుని "మరుమగళే!" కోడలా అంటూ పిలిచారు. సీతా దేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు. "నప్పిన్నాయ్!" ఓ సమగ్రమైన సౌందర్య రాశి! అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. "కందం కమరుం కురలి" సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ."కడై తిఱవాయ్" గడియ తెరువుమా. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని.

"కోరి అరైత్తన కాణ్" కోడి కూస్తుంది, అయితే కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. లేదమ్మా "ఎంగుం " అన్ని కోళ్ళు కూస్తున్నాయి "వంద్" తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాళ్ చెబుతుంది.

నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. "మాదవి ప్పందల్ మేల్" మాధవీ లత ప్రాకిన పందిరి మీద "పల్గాల్" అనేక సార్లు "కుయిల్ ఇనంగళ్" కోకిలల గుంపులు "కూవిన కాణ్" కూస్తున్నాయి.

బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, "పందార్ విరలి" బంతి చేతులలో కలదానా. ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమిలాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాడం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆదీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.

"ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ" నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం. "శెందామరై క్కైయాల్" నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో "శీరార్ వళై ఒలిప్ప" నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా, "మగిరింద్" అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమ తో, ఆనందంతో "వందు తిఱవాయ్" నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెరవాలి అంటూ నీళాదేవిని అమ్మ లేపింది.

Tiruppavai - తిరుప్పావై 17వ రోజు పాశురము





తిరుప్పావై 17వ రోజు పాశురము


అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్ ||

ఈరోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మ ను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నిన్నీ పాశురంలో వివరించింది. నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి పంపాక, ఒక్క సారి తొంగి చూసారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు, కాని ఒక కాలికి కడియం వేసి ఉంది, మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుషా వారు కృష్ణ, బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు. ఏక్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు.

ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాళ్, "అమ్బరమే" వస్త్రములు, "తణ్ణీరే" నీళ్ళు, "శోఱే" ఆహారం, "అఱం శెయ్యుం" ఏ ప్రయోజనం ఆశించకుండా, "ఎమ్బెరుమాన్" దానం ఇచ్చే "నందగోపాలా!" నంద గోపాలా "ఎరుందిరాయ్" లేవయ్యా, అనిలేపారు.

ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది, మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం. అదే యశోదమ్మ అని అనొచ్చు, ఎందుకంటే యశస్సును ప్రసాదించేది - యశోద లేక మంత్ర రత్నం. "కొన్బనార్ క్కెల్లాం" సుందరమైన దేహ స్వరూపం కల్గి, స్త్రీ జాతి కందరికి "కొరుందే!" చిగురులాంటి దానా. "కుల విళక్కే" ఆ కృష్ణ ప్రేమ కల్గిన కులానికే ఒక దీపంలాంటి దానా "ఎమ్బెరుమాట్టి" నీవే ఆయన అనుగ్రహాన్ని కల్గించే స్వామినివి "యశోదా!" ఓ యశోదమ్మా! "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రం గా ఊహించింది అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది, ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.

అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి, అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. "అమ్బరం ఊడఱుత్తు" ఆకాశం మధ్య అంతా ఆక్రమించేట్టుగా "ఓన్గి" పెరిగి "ఉలగళంద" లోకాలను అంతా కొలిచిన, "ఉమ్బర్ కోమానే!" దేవతలందరికి నియంత అయిన స్వామి "ఉఱంగాదు" నిద్ర పోవటానికా నీవు వచ్చావు ఇక్కడికి, "ఎరుందిరాయ్" లేవయ్యా. అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీగురించి తెల్సుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాళ్ విన్నపించింది.

ఆయన లేవలేదు, అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతరంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు, బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు, ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు, ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేసారు, ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు. "శెమ్బొఱ్ కరలడి" అపరంజి బంగారు కడియం కల్గిన "చ్చెల్వా" ఓ సంపన్నుడా "బలదేవా!" బలదేవా! "ఉమ్బియుం నీయుం" నీవూ నిద్ర పోకూడదు, "ఉఱంగ్" మమ్మల్ని రక్షించు. అయితే బలరాముడు లేచి మీరు భ్రమించారు, కృష్ణుడు ఇక్కడ లేడు నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు.


Tiruppavai - తిరుప్పావై 16వ రోజు పాశురము





తిరుప్పావై 16వ రోజు పాశురము


నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్ ||

మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి. ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది.

ఆ భవనంకు ఒక తోరణం ఒక ధ్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాళ్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.

"నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ధ్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చే్రాల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ధ్వజం. ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్" మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా అని నమస్కరించారు. "మణిక్కదవం" మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళం తీయవయ్యా.

ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్లపిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, "నెన్నలే వాయ్-నేరుందాన్" నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం ఆయనచుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటే "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదయా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్" చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని.


"వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృఢంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు, ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.